సహకార సంఘాల పనితీరు ఆధారంగానే బడ్జెట్
కర్నూలు(అగ్రికల్చర్): సహకార సంఘాల పనితీరు ప్రాతిపదికన పారదర్శకంగా రుణాల పంపిణీకి బడ్జెట్ కేటాయిస్తున్నట్లు జిల్లా సహకార కేంద్రబ్యాంకు సీఈఓ రామాంజనేయులు తెలిపారు. రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతో రికవరీ 50 శాతంలోపు ఉన్నప్పటికి 51 సహకార సంఘాలకు దీర్ఘకాలిక రుణాల కింద రూ.కోటి ప్రకారం అలాట్‌మెంటు ఇచ్చినట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని కొన్ని సహకార సంఘాలకు బడ్జెట్ నిలిపివేసినట్లు వచ్చిన విమర్శల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు. సహకార సంఘాల ద్వారా పంపిణీ చేసే రుణాలపై కమీషన్‌లు తీసుకున్నట్లు ఫిర్యాదులు వస్తే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
కంది రైతులు పేర్లు
నమోదు చేసుకోండి
కర్నూలు(అగ్రికల్చర్): 2025 ఖరీఫ్ సీజన్‌లో పండించిన కందులను మద్దతు ధరతో అమ్ముకునేందుకు రైతు సేవ కేంద్రాల ఇన్‌చార్జ్‌లను సంప్రదించి రైతులు పేర్లు నమోదు చేయించుకోవాలని మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ జి.రాజు తెలిపారు. నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో మద్దతు ధర రూ.8 వేలు ప్రకారం కొనుగోలు చేస్తామన్నారు. కందులు పండించిన రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. కనీసం నాణ్యత ప్రమాణాలతో ఉండే విధంగా కందులను సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. కంది సాగు చేసినట్లు ఈ–క్రాప్‌లో నమోదై ఉండాలని తెలిపారు.
పట్టపగలే రెచ్చిపోయిన
దొంగలు
కోసిగి: పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. కోసిగి మండల పరిధిలోని సజ్జలగుడ్డం గ్రామంలో రెండు ఇళ్లలో చొరబడి అందినకాడికి దోచుకెళ్లారు. వివరాలోకి వెళితే.. గ్రామానికి చెందిన కురువ గుండప్ప గారి గర్జప్ప, సిద్దమ్మలు తల్లి కొడుకులు పక్కక్కనే నివాసం ఉంటున్నారు. రెండిళ్లకు కాంపౌండ్ వాలు మాత్రమే అడ్డుగా ఉంది. గర్జప్ప కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ పనుల నిమిత్తం పొలం పనులకు వెళ్లాడు. పక్క ఇంట్లో ఉన్న ఆయన తల్లి సిద్దమ్మ ఆరోగ్యం బాగాలేక పోతే చూపించుకునేందుకు కోసిగి ఆసుపత్రికి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన దొంగలు గర్జప్ప ఇంటి తలుపులు పగలకొట్టి లోపలికి జొరబడ్డారు. ఇంట్లోని బీరువాను బద్దలుకొట్టి అందులో ఉన్న 4తులాల బంగారు, 74 తులాల వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. అలాగే పక్కన ఉన్న సిద్దమ్మ ఇంటి తలుపు తెరిచి ఇంట్లో ఉన్న ట్రంక్ పెట్టె పగలకొట్టి ఒకటిన్నర తులం బంగారం ఎత్తుకెళ్లారు. బాధితులు ఇంటికి వచ్చి చూసుకొని కోసిగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుం చేపట్టారు.


