వ్యర్థాల సేకరణకు ‘ స్వచ్ఛ రథాలు ’
కర్నూలు(అర్బన్): గ్రామీణ ప్రాంతాల్లో వ్యర్థాలను సేకరించేందుకు జనవరి 17వ తేది నాటికి స్వచ్ఛ రథం అనే పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు జిల్లా పరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్‌లోని మినీ సమావేశ భవనంలో ఉమ్మడి జిల్లాకు చెందిన డీడీఓ, ఎంపీడీఓలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ వ్యర్థాల సేకరణలో భాగంగా జిల్లాలోని ఆదోని, కోడుమూరు, పత్తికొండ, కృష్ణగిరి, ఆస్పరి, కల్లూరు, ఓర్వకల్ మండలాల్లో స్వచ్ఛ రథాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆయా మండలాలకు చెందిన ఎంపీడీఓలు ఔత్సాహికుల నుంచి స్వచ్ఛ రథాల నిర్వహణకు నెలవారి అద్దెకు ఒక్కో మండలం నుంచి ఒక స్వచ్ఛ రథాన్ని ఎంపిక చేయాలన్నారు. అలాగే జిల్లాలో ప్రారంభమైన సమగ్ర కుటుంబ సర్వేలను గ్రామ/ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా త్వరితగతిన పూర్తి చేయించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి, కర్నూలు డీడీఓ వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


