ముక్కోటి వైభవం
ఉమ్మడి కర్నూలు జిల్లాలో గోవింద నామస్మరణ మార్మోగింది. ముక్కోటిఏకాదశిని పురస్కరించుకుని వైష్ణవాలయాలు భక్తులతో పోటెత్తాయి. మంగళవారం తెల్లవారు జాము నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉత్తర ద్వారం గుండా భక్తులు వెళ్లి మహా విష్ణువును దర్శించుకొని తరించారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం ద్వారా శ్రీహరిని దర్శించుకుంటే పుణ్యం కలగడంతో పాటు సర్వ పాప హరణం జరుగుతుందని భక్తుల నమ్మకం. దీంతో కర్నూలు, నంద్యాల, ఆదోని, మంత్రాలయం, శ్రీశైలం, మహానంది, అహోబిలం, డోన్, పత్తికొండ, నందికొట్కూరు, కల్లూరు, బనగానపల్లె, ఆత్మకూరు, ఆర్‌ఎస్ రంగాపురం మద్దిలేటయ్య దేవస్థానం, పెరవలి రంగనాథ క్షేత్రంతో పాటు తదితర ప్రాంతాల్లో వైష్ణవాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. పలు ఆలయాల్లో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య గోవిందుడి కల్యాణ వేడుకలు వైభవంగా జరిగాయి. మంత్రాలయంలో వెలసిన శ్రీ వేంకటేశ్వర దేవాలయంలో శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు వైకుంఠ ద్వారంలో ప్రవేశించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
–సాక్షి, నెట్‌వర్క్
ముక్కోటి వైభవం
ముక్కోటి వైభవం


