కోడలికి మేడలు లేవని చెబుతాం!
పెద్దహోతూరు గ్రామం ఏరియల్ వ్యూ
తరాలు మారినా, కంప్యూటర్ యుగం నడుస్తున్నా ఆ గ్రామంలో ఇప్పటికీ ఓ ఆచారం కొనసాగుతోంది. ఎంతటి వారైనా, ఉన్నతాధికారులైనా తమ గ్రామంలో ఉండాలంటే ఈ ఆచారాన్ని కచ్చితంగా పాటించాల్సిందే. గ్రామస్తుల ఆరాధ్య దైవమైన ఉచ్చీరప్ప తాత ఆలయం కంటే ఒక్క ఇంచు కూడా ఎత్తుగా ఇళ్లను కట్టరాదన్నది ఇక్కడ ఏళ్ల తరబడి కొనసాగుతున్న సంప్రదాయం. తమ పెద్దలు ఆచరించి చూపిన నియమాన్ని తాము ఎప్పటికీ పాటిస్తామని ఆ గ్రామస్తులు ముక్త కంఠంతో చెబుతున్నారు. ఆలూరు మండలం పెద్దహోతూరు గ్రామంలో 6,500 మంది ఓటర్లు, దాదాపు 2,900 వరకు గృహాలు ఉన్నాయి. గ్రామంలో మోతుబరి రైతైనా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణించిన వారైనా, ఆర్థికంగా ఉన్న వారైనా ఇంటిపై మేడలు కట్టరు. గ్రామస్తుల ఆరాధ్య దైవం ఉచ్చీరప్ప తాత ఇక్కడ ఎన్నో మహిమలు చూపి భక్తుల విశ్వాసం పొందారు. తన ఆలయం కంటే ఎత్తుగా ఎవరూ మిద్దెలు నిర్మించుకోరాదని గ్రామస్తులను ఆజ్ఞాపించారు. తద్వారా గ్రామానికి ప్రతిష్ట ఉంటుందని చూచించారు. నాటి ఆయన ఆజ్ఞను గ్రామస్తులు నేటికీ పాటిస్తున్నారు. దీంతో ఆ ఊరి కోడలిగా వచ్చే యువతికి, ఆమె బంధువులకు వివాహం కుదుర్చుకునే సమయంలోనే తమకు మేడలు లేవని చెప్పడం సంప్రదాయంగా వస్తోంది. కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగినా మరోచోట ఖాళీ స్థలం తీసుకొని ఇంటిని నిర్మించుకుంటారు గానీ మిద్దైపె మరో అంతస్తు కట్టే సాహసం చేయరు. పెద్దహోతూరు గ్రామంలో కొలువుదీరిన ఉచ్చీరప్పతాత, సమీపంలోని మరకట్టు గ్రామంలో కొలువుదీరిన సలువప్ప తాత ఆజ్ఞల మేరకు నేటికీ ఈ సంప్రదాయం కొనసాగిస్తున్నారు. అలాగే జన్మించిన శిశువులకు ఉచ్చీ రప్ప, ఉచ్చీరమ్మ, సలువప్ప తాత పేర్లు పెట్టడం అనవాయితీగా వస్తోంది. - ఆలూరు
ఉచ్చీరప్ప తాత శ్రీమూలవిరాట్
కోడలికి మేడలు లేవని చెబుతాం!


