పోలీసు – సచివాలయ ఉద్యోగుల మధ్య విభేదాలు సృష్టించే యత్నం ఇబ్బందులు ఎదుర్కొన్న మా మీదే కేసులు పెట్టడం దుర్మార్గం ఆవేదన వ్యక్తంచేస్తున్న గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ‘సచివాలయ సిబ్బంది, పోలీసుల మధ్య ప్రభుత్వం చిచ్చు పెడుతోంది. మేము, పోలీసులు ప్రభుత్వ ఉద్యోగులమే. మాకు వారంతా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు. అటువంటి మా మధ్య ప్రభుత్వం చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోంది’ అంటూ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఇటీవల చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొన్న తమపై పోలీసులు కేసులు నమోదు చేయటం, తమ వివరాలను సేకరించడంపై సచివాలయ సిబ్బంది విస్మయం వ్యక్తంచేస్తున్నారు. తమకు న్యాయంగా రావాల్సిన హక్కుల గురించి వివరించి, ప్రభుత్వానికి తమ ఆవేదనను వ్యక్తం చేయటానికి చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టామని స్పష్టంచేశారు. అయితే ప్రభుత్వ పెద్దలు తమ ఆందోళనను మరో రకంగా తీసుకొని తమపై కక్షకట్టే ప్రయత్నం చేయటం దారుణమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అనుమతి లేదనటం కుట్రలో భాగమే..
సచివాలయ సిబ్బంది అనేక మాసాలుగా వారి సమస్యల గురించి ప్రభుత్వానికి వివిధ రూపాల్లో విన్నవిస్తున్నారు. మంత్రులు, ఇతర ప్రభుత్వ పెద్దలను కలిసి తమకు రావాల్సిన హక్కుల గురించి విజ్ఞ ప్తులు చేస్తున్నారు. దానికి తోడు గడిచిన ఎన్నికల్లోనూ సచివాలయ సిబ్బందికి అనేక వాగ్దానాలు చేసినట్లు గుర్తు చేస్తున్నారు. వాటి సాధన కోసం చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టి మరో సారి ప్రభుత్వానికి తమ సమస్యలను గురించి వివరించా లని నిర్ణయించామని, అనుమతి కోసం పోలీసు శాఖకు దరఖాస్తు చేశామని తెలిపారు. అందరూ విజయవాడకు బయలుదేరిన తరువాత ముందు రోజు రాత్రి అనుమతి లేదంటూ ప్రకటించటం, ఎక్కడికక్కడ నిర్బంధించటం కుట్రలో భాగమేనని సచివాలయ ఉద్యోగ నేతలు విమర్శిస్తున్నారు.
మేం సంఘ విద్రోహ శక్తులం కాదు..
తమ సిబ్బంది నిబద్ధతతో ఉద్యోగాలు చేస్తున్నారని సచివాలయ ఉద్యోగుల సంఘ నేతలు స్పష్టంచేస్తున్నారు. విజయవాడలో ఎక్కడికక్కడ తమను నర్బంధించి, మహిళలను సైతం పోలీసుస్టేషన్లకు తరలించటం, రాత్రి వరకూ స్టేషన్లలోనే ఉంచ టంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. తమపై కేసులు అంటూ రాష్ట్ర వ్యాపితంగా భయకంపితు లను చేస్తున్నారని వాపోతున్నారు. తాము సంఘ విద్రోహ శక్తులం కాదని, ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఉద్యోగులమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో లక్షా 30 వేల మందికి పైగా ఉన్న తమపై ప్రభుత్వం ఈ విధమైన నిర్బంధాలు విధించి ఇబ్బందులు పెట్టడం ఏమిటో అర్థం కావటం లేదంటూ ఉద్యోగ సంఘ నేతలు వాపోతున్నారు.
అత్యధిక విద్యార్హతలు
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల్లో అత్యధిక విద్యార్హతలు ఉన్నవారు సచివాలయ సిబ్బందేనని వారు చెబుతున్నారు. డిగ్రీలే కాకుండా పీజీలు, ఎంఫీల్, పీహెచ్‌డీ చేసిన వారు సైతం సచివాలయ ఉద్యోగుల్లో ఉన్నారంటూ వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ధర్నా చేసిన తరువాత రెండు గంటలకు అందరూ వెళ్లిపోయేవారమేనని, అందరూ తమ గమ్యస్థానాలకు వెళ్లటానికి మూడు గంటల నుంచే రైలు, బస్సు టిక్కెట్లు బుక్ చేసుకున్నారని ఉద్యోగ సంఘ నేతలు చెబుతున్నారు. అయితే తమను ఎక్కడికక్కడ నిలిపివేసి రాత్రి వరకూ అందరినీ విజయవాడలో ఉండేలా పోలీసు శాఖ నిర్బంధించటం వల్ల తాము చాలా ఇబ్బందు లెదుర్కొన్నామని ఉద్యోగులు చెబుతున్నారు.


