దసరా ఉత్సవాలకు ప్లాన్‌–బీ | - | Sakshi
Sakshi News home page

దసరా ఉత్సవాలకు ప్లాన్‌–బీ

Oct 1 2026 9:45 AM | Updated on Oct 1 2026 9:45 AM

మహామండపం వైపు క్యూలైన్లు వర్ష సూచనతో మారుతున్న ప్రణాళికలు ముమ్మరంగా విద్యుత్‌ దీపాల అలంకరణ

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాలకు ఆలయ అధికారులు ప్లాన్‌–బీ సిద్ధం చేస్తున్నారు. ఏటా ఉత్సవాల్లో భక్తులు కొండపైకి చేరుకునేందుకు ఘాట్‌ రోడ్డు మీదగా క్యూలైన్లు ఏర్పాటు చేస్తారు. ఈ ఏడాది కూడా అదే తరహాలో క్యూలైన్ల ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే కొద్ది రోజుల కిందట తుపాను నేపథ్యంలో కురిసిన భారీ వర్షాలకు ఘాట్‌రోడ్డులోని రెండో మలుపు వద్ద భారీగా కొండ చరియలు విరిగి పడ్డాయి. ఘాట్‌ రోడ్డులో మరమ్మతుల కారణంగా రాకపోకలను నిలిపివేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఉత్సవాల తరుణంలో అనుకోకుండా వర్షాలు కురిస్తే ఘాట్‌ రోడ్డును మూసివేసే అవకాశాలు ఉన్నాయి. 24వ తేదీ కొండ చరియలు విరిగిన ప్రదేశంలో మరి కొన్ని చరియలు ప్రమాదకరంగా ఉన్నాయని ఆలయ అధికారులకు ఇటీవల ఇంజినీరింగ్‌ నిపుణులు సూచించారు. దీంతో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయాలని దేవస్థాన అధికారులు భావిస్తూ ప్లాన్‌–బీకి రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. వినాయకుడి గుడి నుంచి ప్రారంభమయ్యే క్యూలైన్లను రథం సెంటర్‌ నుంచి మహా మండపం వైపు మళ్లించేందుకు వీలుగా కూడా పనులు చేస్తున్నట్లు సమాచారం. క్యూలైన్లు కనకదుర్గనగర్‌, మహా మండపం మెట్ల మార్గం ద్వారా ఆలయ ప్రాంగణానికి చేరుకుంటాయి. అమ్మవారి దర్శనం పూర్తయిన వారు మల్లేశ్వర స్వామి ఆలయం మెట్ల మార్గం ద్వారా కిందకు దిగేలా ప్రణాళికలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశాన్ని సెప్టెంబర్‌ 28వ తేదీన జిల్లా ఇన్‌చార్జి మంత్రితో జరిగిన సమీక్ష సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ ప్రస్తావించారు. అనుకొని పరిస్థితులు ఎదురయితే ముందస్తుగా మరో ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని సూచన ప్రాయంగా మీడియాకు వివరించారు. దసరా ఉత్సవాలకు విద్యుత్‌ దీపాల అలంకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement