కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ విశేష సేవలందించి, ఇంటింటికీ సంక్షేమాన్ని పంచిన గ్రామ/వార్డు సచివాలయ వలంటీర్లను దారుణంగా అవమానించారు.. వైఎస్సార్ సీపీ ఏజెంట్లుగా ముద్రవేశారు.. వారికి ఇచ్చే రూ.5 వేల గౌరవ వేతనం ఎందుకివ్వాలని ప్రశ్నించారు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే వారిని అవస్థల పాల్జేసి.. ఆ వ్యవస్థనే లేకుండా చేశారు.
సీన్ కట్ చేస్తే.. అదే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్‌ల పేరిట కొత్త వ్యవస్థను తీసుకొచ్చి భారీగా పంపకాలకు పూనుకుంది. ప్రజాసేవకు ఏమాత్రం ఉపయోగపడని ఒక భజన బృందానికి జనం డబ్బును వాడేందుకు సిద్ధమైంది. కేవలం సర్కారుకు డప్పు కొట్టేందుకే వారికి భారీ నజరానాలు ప్రకటించింది. దీనిపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో వలంటీర్లుగా పనిచేసిన వారు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. – సాక్షి నెట్‌వర్క్
కులం, మతం, పార్టీలకు అతీతంగా అందరికీ సేవలు అందించాం. ఎన్నికల ముందు చంద్రబాబు పలు సభల్లో అధికారంలోకి వస్తే వంలంటీర్లకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు ఇస్తామని చెప్పారు. అధికారంలోకి రాగానే తొలగించారు. రూ.5 వేలు ఇవ్వడం భారమని చెప్పి నేడు ఇన్‌ఫ్లుయెన్సర్లకు రూ.వేలకు వేలు ఎలా ఇస్తారు? వలంటీర్ల పొట్టకొట్టడం న్యాయమేనా? 2.61 లక్షల మంది వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలి.
– కంభపు లక్ష్మయ్య, మాజీ వలంటీర్, మంటాడ, పమిడిముక్కల మండలం, కృష్ణాజిల్లా
కూటమి ప్రభుత్వం వలంటీర్లను పూర్తిగా మోసగించింది. ఎన్నికల వేళ అధికారంలోకి రాగానే రూ.10 వేల వేతనం ఇస్తామని ఆశచూపింది. తీరా అధికారంలోకి వచ్చాక రూ.10 వేల మాట అటుంచి ఏకంగా వలంటీర్ వ్యవస్థనే తొలగించింది. రూ.5 వేల గౌరవ వేతనంతో ఇంటింటికీ తిరిగి పారదర్శకంగా సేవలు అందించాం. కూటమి ప్రభుత్వం వలంటీర్‌లను తొలగించి ఇన్‌ఫ్లూయన్సర్‌లకు రూ.లక్షలు కట్టబెడుతోంది. ఈ నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలి.
– కస్తాల అనిల్‌కుమార్, మాజీ వలంటీర్, చందర్లపాడు, ఎన్టీఆర్ జిల్లా


