ముగ్గురు నిందితులు అరెస్ట్
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ఒడిశా నుంచి గంజాయిని రవాణా చేస్తున్న ముగ్గురు యువకులు అరెస్టు చేసి వారి నుంచి 1.360 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని డీసీపీ గుణ్ణం రామకృష్ణ పేర్కొన్నారు. కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో డీసీపీ గుణ్ణం రామకృష్ణ, వెస్ట్ ఏసీపీ దుర్గారావు మాట్లాడారు. ఇస్లాంపేటలోని దళాయి వారి వీధిలో పాడుపడిన బిల్డింగ్ వద్ద ముగ్గురు యువకులు అనుమానాస్పదంగా కనిపించారు. వీరిపై పోలీసులకు సమాచారం రావడంతో సీఐ, ఇతర పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. ఇస్లాంపేటకు చెందిన షేక్ అస్ఘర్(21), ఆటోనగర్‌లో పని చేసే షేక్ మహమ్మద్ ఇబ్రహీం ఖలీల్(20)కు, రామరాజ్యనగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ కట్టా ప్రసాద్‌లకు పరిచయం ఉంది. కట్టా ప్రసాద్ భవానీపురంలో 2020లో ఆటోలో ఎక్కిన ఓ ప్రయాణికుడిని బెదిరించి డబ్బులు లాక్కున్న కేసులో నిందితుడు. ఈ క్రమంలో ముగ్గురు గంజాయికి అలవాటు పడ్డారు. రైలులో ఒడిశాలోని రాయగడకు వెళ్లి మార్కెట్‌లో గుర్తు తెలియని వ్యక్తి వద్ద నుంచి రెండు కిలోల గంజాయి కొనుగోలు చేసి విజయవాడకు తీసుకువచ్చారు. కొనుగోలు చేసిన గంజాయిలో కొంత వినియోగించుకున్న తర్వాత మిగిలిన దానిని పంచుకునేందుకు పాడుబడ్డ బిల్డింగ్ వద్దకు వచ్చారు. అక్కడ అనుమానాస్పదంగా పోలీసుల కంట పడటంతో అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 1.360 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కొత్తపేట సీఐ కొండలరావు, స్టేషన్ ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.


