● భారీగా సొమ్ము స్వాహా ● విచారణకు ఆదేశించిన పీడీ
పెనమలూరు: మండలంలోని వెలుగు కార్యాలయం అవినీతి, అక్రమాలతో ప్రకంపనలు సృష్టి స్తోంది. డ్వాక్రా మహిళలు పొదుపు చేసిన సొమ్మును అవినీతి తిమింగిలాలు స్వాహా చేశాయి. దీంతో డ్వాక్రా మహిళలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ వ్యవహారం బయటకు రావటంతో డీఎర్‌డీఏ పీడీ విచారణకు ఆదేశించారు. పెనమలూరు మండలంలో డ్వాక్రా సంఘాలలో సభ్యులు పొదుపు చేసిన సొమ్ము రూ.కోట్లలో గల్లంతైంది. దీని వెనుక ఏపీఎం, వీఓఏలు, డ్వాక్రా లీడర్లు, బుక్ కీపర్ల పాత్ర ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. డ్వాక్రా మహిళలు బ్యాంకుల ద్వారా పొందిన రుణాలు, అలాగే సీ్త్ర నిధి నుంచి పొందిన రుణాలు తీసుకుని తిరిగి సకాలంలో సంఘ లీడర్ల ద్వారా చెల్లించారు. అయితే వీఓఏలు, బుక్‌కీపర్లు, సీసీలు, ఏపీఎం నిర్లక్ష్యం కారణంగా ఆ సొమ్ము గల్లంతైందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వెలుగు కార్యాయలంలో కొద్ది కాలంగా అవినీతి రాజ్యమేలుతున్నా అధికారులు చర్యలు తీసుకోలేదు. ఆడిట్ రిపోర్టులను తుంగలోకి తొక్కి నిధులు స్వాహా చేశారని సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు దాదాపు రూ.3 కోట్ల వరకు పొదుపు నిధులు గల్లంతయ్యాయన్న ప్రచారం జరుగు తోంది. ఎంత సొమ్మును అక్రమార్కులు దోచేశారన్న విషయమై అధికారులు నోరుమెద పటం లేదు. పేద మహిళలు పొదుపు చేసుకున్న సొమ్ముకు ఇప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారని సంఘాల సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఈ నష్టాన్ని ప్రభుత్వమే భరించాలని బాధిత మహిళలు కోరుతున్నారు. ఈ వ్యవహారంపై బడానేత వద్ద పంచా యితీ జరుగుతోందని సమాచారం.
గతంలో కూడా నిర్లక్ష్యం
పెనమలూరు వెలుగు కార్యలయంలో గతంలో కూడా నిధులు గోల్‌మాల్ చేసినా అధికారులు వ్యవహారాన్ని నీరుకార్చారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. గతంలో డ్వాక్రా నిధుల్లో రూ.43 లక్షలను పూర్వ వీఓఏ సునీతారాణి స్వాహా చేశారు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తరువాత ఆమె వద్ద నిధులు రికవరీ చేయలేదు. విచారణ పేరుతో తీవ్ర జాప్యం చేశారు. చివరకు గత జూలైలో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయినా ఆమె వద్ద నయాపైసా రికవరీ చేయలేదు. పొదుపు చేసిన మహిళలు తీవ్రంగా నష్టపోయారు. బాధ్యులైన మిగితా వారిపైనా చర్యలు తీసుకోలేదు.
విచారణకు ఆదేశాలు
పెనమలూరు వెలుగు కార్యాలయంలో అక్రమాలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై కృష్ణా డీఆర్‌డీఏ పీడీ హరిహరనాథ్‌ను వివరణ కోరగా విచారణకు ఆదేశించానని తెలిపారు. డీపీఎం, ఏపీఎంలు విచారణ చేస్తారని పేర్కొన్నారు. నివేదిక వారం రోజుల్లో అందే అవకాశం ఉందన్నారు. నిధులు స్వాహా జరిగితే అందరు బాధ్యత వహించాల్సి ఉంటుందని, తప్పక చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.


