చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో 1,059 రేషన్ షాపులు వాటిలో 275 షాపులను మినీ మార్ట్‌లుగా ఏర్పాటు చేసేందుకు ఎంపిక చేసినట్టు జిల్లా పౌరసరఫరాల అధికారి పి.శివరామప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో శనివారం సాయంత్రం పీడీఎస్ డీటీలు, మినీ మార్ట్‌లకు ఎంపికై న రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మొదటి దశలో 68 షాపులను గుర్తించగా వాటిలో 57 షాపులను మినీ మార్ట్ లుగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మిగిలిన డీలర్లు కూడా రెండు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఈ మార్ట్‌ల ద్వారా వినియోగదారులకు నాణ్యమైన నిత్యావసర సరుకులు సరసమైన ధరలకు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. అర్హత కలిగిన రేషన్‌డీలర్లకు అదనపు వ్యాపార అవకాశాలు కల్పించటం, స్థానిక రిటైల్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయటం ప్రధాన లక్ష్యమన్నారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.


