తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
గుడివాడరూరల్: స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో 1500 మంది ఏకకాలంలో 108 మహా సూర్య నమస్కారాలు చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సాధించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణరాజు సహకారంతో గురువారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్య యోగా డైట్ నిపుణుడు పూడి లక్ష్మణ్ సూచనలతో గుడివాడకు చెందిన యోగా శిక్షకురాలు వర్రే లీలావతి ఆసనాలు వేయించారు. కార్యక్రమంలో ఆర్డీవో జి.బాలసుబ్రహ్మణ్యం, స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, కార్యదర్శి కిలారు రంగప్రసాద్, వన్‌టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో ఈనెల 5, 6వ తేదీల్లో రెండు రోజులపాటు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. జిల్లాలోని మొత్తం 1,936 పోలింగ్ కేంద్రాల్లో ఈ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)–2026 ముసాయిదా జాబితాలో అందిన క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం, తుది జాబితా తయారీపై గురువారం రాష్ట్ర సచివాలయంలోని ఎన్నికల విభాగ కార్యాలయం నుంచి సీఈఓ వివేక్ యాదవ్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులు ఈ రెండు రోజులు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాజకీయ పార్టీలు నియమించిన బూత్ స్థాయి ఏజెంట్లతో కలిసి అందుబాటులో ఉంటారన్నారు. అధికారులు దరఖాస్తులు స్వీకరించడం, ఓటర్ల సందేహాలను నివృత్తి చేసి తగిన సలహాలు, సూచనలు చేస్తారన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని అర్హత కలిగిన వయోజనులు, అలాగే 18–19ఏళ్ల యువత ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని కొత్తగా ఓటు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.


