సంస్థ సీజీఎం శేషాచలం
మధురానగర్(విజయవాడసెంట్రల్): బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారుల అవసరాలు, ఆకాంక్షల మేరకు మరింత నాణ్యమైన సేవలు అందించటంతో పాటు స్వాతంత్య్ర దినోత్సవ ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు ఆ సంస్థ ఏపీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.శేషాచలం తెలిపారు. విజయవాడ చుట్టుగుంట బీఎస్‌ఎన్‌ఎల్ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్రీడమ్ 2.0 మొబైల్ ఆఫర్‌లో భాగంగా కేవలం రూ.1కే సిమ్ అందజేయనున్నట్లు తెలిపారు. ఈ ప్లాన్‌లో రోజుకు ఒక జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత కాల్స్ 24 రోజుల వ్యాలిడిటీతో లభిస్తాయన్నారు. అలాగే రూ.2399 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లో 365 రోజులకు అదనంగా మరో 47 రోజుల వ్యాలిడిటీ ఇస్తున్నామని తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్ ఫైబర్ ప్రీడమ్ ఫ్లాన్ రూ. 1111 ద్వారా 200 ఎంబీపీఎస్ వేగంతో నెలకు 5000జీబీ డేటాతో పాటు 25కు పైగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అపరిమిత వాయిస్ కాల్స్ లభిస్తాయని వివరించారు. ఫైబర్ బేసిక్ ప్లాన్‌లో నెలకు రూ. 499 అద్దెతో కొత్తగా తీసుకునే వినియోగదారులకు మొదటి నెల సేవలను ఉచితంగా అందించటంతో పాటు నెలకు రూ. 100 చొప్పున మూడు నెలల పాటు రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు.
మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీ..
ఏపీ సర్కిల్‌లో 6850 టవర్లు, 15 వేల బీటీఎస్‌ల ద్వారా మారుమూల ప్రాంతాలకు సైతం సేవలు అందిస్తున్నామన్నారు. అన్‌కవర్డ్ గ్రామాలకు 4జీ మొబైల్ సేవలను అందించేందుకు మరో 814కొత్త 4జీ ఆమోదం లభించిందన్నారు. ఇప్పటికే 367 సైట్లలో పనులు ప్రారంభమయ్యాయని.. వచ్చే ఏడాది మార్చి నాటికి పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నామని తెలిపారు. సమావేశంలో బీఎస్‌ఎన్‌ఎల్ పీజీఎం వై.రవీంధ్రనాధ్, ఎల్.శ్రీను, జీఎం కె.మురళీకృష్ణ, కె.వెంకట ప్రసాద్, కె.సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


