వైఎస్సార్‌ సీపీలో పలువురికి పదవులు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలో పలువురికి పదవులు

Aug 21 2026 7:39 AM | Updated on Aug 21 2026 7:39 AM

వైఎస్సార్‌ సీపీలో పలువురికి పదవులు హెడ్‌ కానిస్టేబుల్‌ కుటుంబానికి బీమా చెక్కు అందజేత మాతా శిశు ఆరోగ్య సేవలకు ప్రాధాన్యం దుర్గమ్మకు కానుకగా బంగారు హారం

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించి ఎన్టీఆర్‌ జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన నేతలను జిల్లా స్థాయి పదవుల్లో నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అలంపూరు విజయను పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, గంజి రమేష్‌కుమార్‌రెడ్డి పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా, పులప కృష్ణ జిల్లా కార్యదర్శి (యాక్టివిటి)గా నియమించారు. అదేవిధంగా యు. కృష్ణవంశీరెడ్డిని ఆర్‌టీఐ విభాగ జిల్లా ఉపాధ్యక్షుడిగా, బత్తుల రాజేష్‌, పులగాని లక్ష్మణ్‌లను పార్టీ బీసీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శులుగా, వేముల వెంకటేశ్వరరావును బీసీ సెల్‌ కార్యదర్శిగా, షేక్‌ బాషాను మైనార్టీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, ఉప్పులూరు మహేష్‌ను ఎస్సీ సెల్‌ జిల్లా కార్యదర్శిగా, మురకొండ సాంబశివరావును సోషల్‌ మీడియా జిల్లా కార్యదర్శిగా, చెరుకుమల్లి హనుమంతరావును రైతు విభాగ జిల్లా కార్యదర్శిగా, శీమల నారాయణరావును వైఎస్సార్‌టీయూసీ జిల్లా కార్యదర్శిగా, చిన్నాల శ్రీనుబాబును యువజన విభాగం జిల్లా కార్య దర్శిగా పార్టీ నియమించింది.

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్‌ జిల్లాలోని వీరులపాడు పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ మొగిలి ప్రభుకుమార్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ 26న రోడ్డు ప్రమాదంలో మృతి చెందా డు. దీంతో ఆయనకు యూనియన్‌ బ్యాంక్‌ బీమా రూ.1.20కోట్లు మొత్తాన్ని గురువారం పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌వీ రాజశేఖరబాబు చేతుల మీదుగా మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. యూనియన్‌ బ్యాంకులో ఖాతా ఉన్న పోలీసు సిబ్బంది ప్రమాదవశాత్తూ మృతి చెందితే, ప్రత్యేక బీమా పథకాన్ని అమలు చేస్తోంది. అందులో భాగంగా యూనియన్‌ బ్యాంకులో ఖాతా ఉన్న మొగిలి ప్రభుకుమార్‌కు బీమా మొత్తాన్ని అందజేశారు. యూనియన్‌ బ్యాంక్‌ జనరల్‌ మేనేజర్‌ కె. శ్రీధర్‌బాబు, డెప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఎంవీ తిలక్‌, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ కె. శ్రీనాథ్‌రెడ్డి, చీఫ్‌ మేనేజర్‌ ఉదయ్‌కిషన్‌ పాల్గొన్నారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): మాతా శిశు ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయాలని ఎన్టీఆర్‌ జిల్లా డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎ. శ్రావణ్‌బాబు అన్నారు. ఆయన గురువారం పాత ఆస్పత్రి ప్రాంగణంలోని సమావేశ హాలులో ఆశా నోడల్‌ అధికారులు, మహిళా ఆరోగ్య సూపర్‌వైజర్లకు మాతా శిశు సేవలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శ్రావణ్‌బాబు మాట్లాడుతూ ఎంసీపీ కార్డు ప్రాధాన్యం, సకాలంలో నమోదు, గర్భిణులు, శిశువులకు అందుతున్న ఆరోగ్య సేవల నిరంతర పర్యవేక్షణ వంటి అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఎంసీపీ కార్డు కేవలం రికార్డు కోసం ఉపయోగించే పత్రం కాదని, గర్భిణికి అందుతున్న ఏఎన్‌సీ సేవలు, హైరిస్క్‌ పరిస్థితుల గుర్తింపు, ప్రసవ వివరాలు, ప్రసవానంతర సంరక్షణ, శిశు ఆరోగ్య వివరాలను నిరంతరం పర్యవేక్షించడానికి ఉపయోగపడే ముఖ్యమైన ఆరోగ్య పత్రం అని వివరించారు. డెప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఇందుమతీదేవి, సీహెచ్‌ఓ కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు రూ.21లక్షలతో రూపొందించిన రాధాకృష్ణుల బంగారు హారాన్ని గురువారం సమర్పించారు. విజయవాడ సీతారాంపురానికి చెందిన తవ్వా పుల్లమ్మ కుటుంబం అమ్మవారి దర్శనానికి విచ్చేసింది. సుమారు 141 గ్రాముల బంగారంతో తయారు చేయించిన బంగారు హారాన్ని ఆలయ చైర్మన్‌ రాధాకృష్ణకు అందజేసింది. రానున్న దసరా ఉత్సవాలలో ఈ హారాన్ని అమ్మవారికి అలంకరించాల్సిందిగా దాతలు ఆలయ అధికారులను కోరారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ చైర్మన్‌ రాధాకృష్ణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement