మధ్యాహ్న కార్మికులకు స్మార్ట్‌ పోటు! | - | Sakshi
Sakshi News home page

మధ్యాహ్న కార్మికులకు స్మార్ట్‌ పోటు!

Aug 21 2026 7:39 AM | Updated on Aug 21 2026 7:39 AM

కృష్ణా జిల్లాలో 32 స్మార్ట్‌ కిచెన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు 2,214 మంది మధ్యాహ్న భోజన కార్మికుల ఉపాధికి గండి

విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదు..

మచిలీపట్నంఅర్బన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో వంట చేసి, వేడివేడిగా భోజనం వడ్డిస్తూ విద్యార్థుల ఆకలి తీరుస్తున్న కార్మికులపై చంద్రబాబు ప్రభుత్వం స్మార్ట్‌ పోటు వేసేందుకు సిద్ధమైంది. జిల్లాలోని 1,324 ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్‌ కిచెన్ల విధానాన్ని అమలు చేయాలని విద్యాశాఖ ఇప్పటికే ప్రతిపాదనలు చేసింది. తద్వారా కార్మికుల ఉపాధికి గండి కొట్టే చర్యలు చేపడుతోంది. జిల్లాలోని మధ్యా హ్న భోజన పథకంలో సుమారు 2,214 మంది వంట కార్మికులు, సహాయకులు పని చేస్తున్నారు. సుమారుగా 21 ఏళ్లుగా అమలవుతున్న ఈ పథకంలో అప్పటి నుంచీ వంట ఏజెన్సీల పేరుతో వంట కార్మికులు, సహాయకులు సేవలు అందిస్తున్నారు.

స్మార్ట్‌ కిచెన్లపై అనుమానాలు..

జిల్లాలో అమలులో ఉన్న మధ్యాహ్న భోజన పథకంపై ప్రభుత్వం తాజాగా ప్రతిపాదిస్తున్న స్మార్ట్‌ కిచెన్స్‌ నిర్ణయం అనేక అనుమానాలకు తావిస్తోంది. 26 మండలాల్లో 32 స్మార్ట్‌ కిచెన్లు (పాయింట్లు), 64 రూట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి పంపించడమే దీనికి నిదర్శనం. ఈ నిర్ణయంతో 2,214మంది కుక్‌ కమ్‌ హెల్పర్ల ఉపాధి దెబ్బతినే ప్రమాదం ఉండగా, సుమారు 67,201 మంది విద్యార్థులు వేడి వేడి భోజనానికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడనుంది.

వైఎస్సార్‌ సీపీ హయాంలో ఇలా..

గతంలో కుక్‌లు కేవలం వెయ్యి రూపాయల గౌరవ వేతనం అందేది. ఆ తర్వాత దానిని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు వేల రూపాయలకు పెంచారు. జగనన్న గోరుముద్ద పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత బలోపేతం చేశారు. పాఠశాలల్లోనే వంటచేసి విద్యార్థులకు వేడి వేడి, పౌష్టికాహారం అందించేలా చిక్కీ, గుడ్డు వంటి పదార్థాలతో మెనూను రూపొందించారు. దీంతో విద్యార్థుల హాజరు పెరగడమే కాకుండా, స్థానికంగా పనిచేస్తున్న కుక్‌ కమ్‌ హెల్పర్లకు ఉపాధి భద్రత కూడా లభించింది.

కార్మికుల పొట్టకొట్టే ప్రయత్నం..

ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పథకం పేరును డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకంగా మార్చి, అదే విధానంలో పాఠశాలల్లో వండిపెట్టే విధానాన్ని కొనసాగిస్తోంది. అయితే ఇప్పుడు ఒక్కసారిగా స్మార్ట్‌ కిచెన్స్‌ పేరుతో కేంద్రీకృత వంటలపై దృష్టి పెట్టింది. దీంతో పాఠశాలల్లో పనిచేస్తున్న కుక్‌ కమ్‌ హెల్పర్లను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

బకాయిలతో ఎండీఎం కార్మికుల అవస్థలు..

మధ్యాహ్న భోజనం తయారు చేసే కార్మికుల విషయంలో వారిని తొలగించాలనే ఉద్దేశంతోనే వేతనాలు సక్రమంగా చెల్లించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మధ్యాహ్న భోజన పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి చెల్లించాల్సిన బకాయిలు పేరుకు పోతున్నాయి. ఎండీఎం కుకింగ్‌ చార్జీలు జూన్‌, జూలై నెలలకు పెండింగ్‌లో ఉండగా, ఆయాలకు చెల్లించాల్సిన వేతనాలు మే, జూన్‌, జూలై నెలలకు బకాయిగా ఉన్నాయి. మరోవైపు పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న నైట్‌ వాచ్‌మెన్‌లకు సైతం ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

స్మార్ట్‌ కిచెన్ల ఏర్పాటుపై విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో స్మార్ట్‌ కిచెన్లు ఎన్ని అవసరమో గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. అయితే స్మార్ట్‌ కిచెన్లు ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తారా? అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. ఎండీఎం కుకింగ్‌ చార్జీలు, ఆయాలు, వాచ్‌ మెన్‌ జీతాల బిల్లులు ట్రెజరీకి అటు నుంచి సీఎఫ్‌ఎంఎస్‌ పంపించాం. త్వరలో జీతాలు అకౌంట్లో పడతాయి.

– యూవీ సుబ్బారావు, డీఈఓ, కృష్ణా జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement