దూసుకొచ్చిన ఆక్సిజన్‌ సిలిండర్లు | - | Sakshi
Sakshi News home page

దూసుకొచ్చిన ఆక్సిజన్‌ సిలిండర్లు

Aug 13 2026 1:51 AM | Updated on Aug 13 2026 1:51 AM

మచిలీపట్నంలోని ఓ దుకాణంలో లీకై న సిలిండర్లు గోడలను బద్దలు కొట్టి రోడ్డుపైకి దూసుకెళ్లిన వైనం ఒకరికి గాయాలు, రెండు ద్విచక్ర వాహనాలు, కారు ధ్వంసం

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): ఆక్సిజన్‌ సిలిండర్ల లీకేజీ ఘటన మచిలీపట్నంలో కలకలం రేపింది. దుకాణంలో లీకై న సిలిండర్లు గోడలను బద్దలు చేసుకుంటూ రోడ్డుపైకి దూసుకొచ్చాయి. ఈ ప్రమాదంలో రెండు ద్విచక్రవాహనాలు, ఓ కారు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఒకరు గాయపడ్డారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీస్‌, ఫైర్‌ అఽధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పోలీసుల కథనం మేరకు.. ఈడేపల్లి బెల్‌ కంపెనీ వెనుక రోడ్డులో ఉన్న అశ్విని ఎంటర్‌ప్రైజెస్‌లో బుధవారం ఉదయం తొలుత ఒక ఆక్సిజన్‌ సిలిండర్‌ లీకై ంది. దానితో పాటు మరో మూడు సిలిండర్‌లు ఒకదాని తరువాత ఒకటి లీకవటంతో షాపులో పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయి. కంగారుపడిన స్థానికులు షాపు వద్దకు వెళ్లి చూస్తుండగా లీకై న సిలిండర్లు పేలి ఒక్కసారిగా గోడను బద్దలుకొట్టుకుని రోడ్డుపైకి దూసుకువచ్చాయి. ఈ ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహ నాలు స్వల్పంగా దెబ్బ తిన్నాయి. ఒక కారు ధ్వంసమైంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న సమ్మెట వెంకట కృష్ణమాచారి గాయపడ్డాడు. అతడిని స్థానికులు నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కృష్ణా జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి ఏసురత్నం, చిలకలపూడి ఎస్‌ఐ పద్మ, ఇతర సిబ్బంది పరిస్థితులను పరిశీలించారు. షాపు యజమాని అద్దంకి వెంకయ్యనాయుడుపై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇళ్ల మధ్య ప్రమాదకరంగా ఉన్న దుకాణాన్ని తక్షణమే ఖాళీ చేయించాలంటూ ఆ ప్రాంత వాసులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఆ షాపులోని సామగ్రిని ఖాళీ చేయించేందుకు చర్యలు చేపట్టినట్లు ఫైర్‌ అధికారి ఏసురత్నం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement