చల్లపల్లి: సైకిల్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని పాలవ్యాన్ ఢీకొనటంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందిన ఘటన 216 జాతీయ రహదారిపై చల్లపల్లి మండల పరిధిలోని నూకలవారిపాలెం అడ్డరోడ్డు వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నూకలవారిపాలెం గ్రామానికి చెందిన మాగంటి వెంకటరమణారావు(56)కు కుమారుడు, కుమార్తె ఇద్దరు సంతానం. కుమార్తె మచిలీపట్నంలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. కుమారుడు పల్నాడు జిల్లా, సత్తెనపల్లిలో బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు. తన కుమారుడి వద్దకు వెళ్లేందుకు వెంకటరమణారావు ఆదివారం ఉదయం నూకలవారిపాలెం నుంచి తను సైకిల్‌పై బయలుదేరి చల్లపల్లి వచ్చాడు. అక్కడ బస్టాండులో సైకిల్ పెట్టి రేపల్లె మీదుగా సత్తెనపల్లిలోని తన కొడుకు వద్దకు వెళ్లాడు. సాయంత్రం అలాగే తిరిగి వచ్చాడు. చల్లపల్లి బస్టాండులో సైకిల్ తీసుకుని వస్తూ పద్మావతి ఆస్పత్రి రోడ్డులో నుంచి 216 జాతీయ రహదారి ఎక్కి ఇంటికి బయలుదేరాడు. మరికొద్ది దూరంలో నూకలవారిపాలెం రోడ్డు వస్తుందనగా ఆదివారం రాత్రి 10.30 సమయంలో బాపట్ల జిల్లా, కావూరికి చెందిన పాలవ్యాను మచిలీపట్నం వైపునకు వెళ్తూ వేగంగా వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టి వెళ్లిపోయింది. దీంతో వెంకటరమణారావు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సీఐ కె.ఈశ్వరరావు, ఎస్‌ఐ డి.దుర్గాంజనేయులు ఘటనా స్థలాని కి వెళ్లి వివరాలు సేకరించారు. అనంతరం పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మోపిదేవి టోల్‌గేట్ వద్ద ఉన్న కెమెరాల్లోని సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఢీకొన్న వాహనం బాపట్ల జిల్లా, కావూరికి చెందిన పాలవ్యానుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.


