జగ్గయ్యపేట అర్బన్: జగ్గయ్యపేట మండలం, గండ్రాయి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు అమరబోయిన రవి, దుండగుల సత్యనారాయణ తదితరులు టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈమేరకు సోమవారం పట్టణంలోని పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావు సమక్షంలో వారు పార్టీలోకి చేరారు. వారికి వైఎస్సార్ సీపీ కండువాలు కప్పి పార్టీలోకి పార్టీ జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు కనపర్తి నరసింహారావు, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి మట్టా ప్రతాపరెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై ఉన్న నమ్మకంతో పార్టీ విధానాలకు ఆకర్షితులై పలువురు ఇతర పార్టీల నుంచి వైఎస్సార్ సీపీలోకి చేరుతున్నామని తెలిపారు. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడుతున్న వైఎస్సార్ సీపీకి క్షేత్ర స్థాయిలో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో గండ్రాయి గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సమష్టిగా కృషిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గండ్రాయి గ్రామ పార్టీ అధ్యక్షుడు దమ్మాలపాటి సత్యనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట్ల వెంకటరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేసేందుకు పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ అనే నేను కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించాలని ఎన్టీఆర్ కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. ఆగస్టు 10 నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలన్నారు. ‘అనే నేను’ కార్యక్రమం ద్వారా ప్రతి పౌరుడు దేశ నిర్మాణంలో తాను చేయగలిగే ఒక మంచి పనిని లేదా కృషిని సంకల్పంగా స్వీకరించాలని కలెక్టర్ సూచించారు. ప్రజలు, అధికారులు, యువత, విద్యార్థులు, క్రీడాకారులు, కళాకారులు, ప్రముఖులు తదితరులు తమ దేశభక్తి, దేశ నిర్మాణంపై తమ ఆలోచనలు, భవిష్యత్ లక్ష్యాలను ప్రతిబింబించేలా 30 సెకన్ల ‘‘అనే నేను’’ వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేయాలని తెలిపారు. ‘‘అనే నేను’’ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసే సమయంలో హ్యాష్‌ట్యాగ్‌లను తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు.స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు ‘‘హర్ ఘర్ తిరంగా’’ కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రతి ఇంటిపైనా జాతీయ పతాకాన్ని ఎగురవేసేలా ప్రజలను భాగస్వాములను చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని పాఠశాలల్లో ‘‘అనే నేను’’ కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులను చురుకుగా భాగస్వాములను చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ మేరకు కలెక్టర్ లక్ష్మీశ ఓ ప్రకటన విడుదల చేశారు.


