అఫీఫాకు మైనారిటీ మంత్రి, డీజీపీ నివాళులు | - | Sakshi
Sakshi News home page

అఫీఫాకు మైనారిటీ మంత్రి, డీజీపీ నివాళులు

Aug 11 2026 2:12 AM | Updated on Aug 11 2026 2:12 AM

అఫీఫాకు మైనారిటీ మంత్రి, డీజీపీ నివాళులు పామర్రులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం అనుమానాస్పద స్థితిలో యువతి మృతి రైళ్లలో సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్న దొంగ అరెస్ట్‌

అజిత్‌సింగ్‌నగర్‌(విజయవాడసెంట్రల్‌): డీసీపీ షిరీన్‌బేగం కుమార్తె ఎండీ అఫీఫా మృతదేహం వద్ద మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫారూఖ్‌, రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా సోమవారం నివాళులర్పించారు. చీరాల బీచ్‌కు స్నేహితులతో కారులో వెళ్తుండగా గుంటూరు జిల్లా ఏటుకూరు బైపాస్‌ వద్ద లారీ, కారు ఢీకొన్న ఘటనలో ట్రాఫిక్‌ డీసీపీ షిరీన్‌బేగం కుమార్తె మహ్మద్‌ అఫీఫా(24) ఆదివారం మృతిచెందిన విషయం తెలిసిందే. షిరీన్‌బేగం, మస్తాన్‌ దంపతులకు కుమారుడు రెహాన్‌, కుమార్తె అఫీఫా సంతానం. అఫీఫా ఆచార్య నాగార్జున యూనివర్సీటీలో ఎంఏ సైకాలజీ చేస్తూ సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతుంది. అఫీఫా మరణవార్తను జీర్ణించుకోలేక డీసీపీ షీరీన్‌బేగం గుండెలవిసేలా రోదిస్తున్నారు. కుమార్తె జ్ఞాపకాలను తలుచుకుంటూ.. ఆమె భౌతికకాయాన్ని చూస్తూ పలుమార్లు కుప్పకూలి పడిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నారు. అఫీఫా భౌతికకాయాన్ని విజయవాడ న్యూఆర్‌ఆర్‌పేటలోని స్వగృహానికి ఆదివారం రాత్రి తీసుకువచ్చారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫారూఖ్‌, రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా, ఇంటెలిజెన్స్‌ ఏడీజీపీ మహేష్‌ చంద్ర లడ్డా, కలెక్టర్‌ లక్ష్మీశ, పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖరబాబు, డీసీపీలు సరిత, తిరుమలేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మేయర్‌, డెప్యూటీ మేయర్లు రాయన భాగ్యలక్ష్మి, అవుతు శ్రీశైలజతో పాటు పోలీసు ఉన్నతాధికారులు, పలు పార్టీల నాయకులు, ప్రముఖులు అఫీఫా మృతదేహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. డీసీపీ షీరీన్‌బేగం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విజయ టాకీస్‌ వద్ద ఉన్న కబర్‌స్తాన్‌లో ముస్లిం సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.

పామర్రు: మండల పరిధిలోని కాలువలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పామర్రు ఎస్‌ఐ కూచిపూడి శ్రీనివాస్‌ సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. స్థానిక పసుమర్రు గ్రామంలోని రవులదొడ్డి కాలువలో గుర్తు తెలియని పురుషుని మృతదేహం తేలుతూ ఉన్నట్లు సమాచారం అందటంతో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించామన్నారు. సుమారు 30–40 ఏళ్ల వయస్సు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహంగా గుర్తించామన్నారు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉందని, ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. మృతుడు బిస్కెట్‌ రంగు టీ షర్టు, నీలం రంగు షాట్‌ ధరించి ఉన్నాడన్నారు. మృతుడి వివరాల కోసం 94407 96431, 83329 83799 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

పెడన: మండల పరిధిలోని కమలాపురం గ్రామానికి చెందిన ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన పెడన పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కమలాపురానికి చెందిన తడిశెట్టి తేజశ్రీ(22) ఆదివారం నుంచి కనిపించకపోవడంతో ఆమె తండ్రి సూరయ్య సోమవారం ఉదయం పెడన పోలీసులను ఆశ్రయించారు. సోమవారం మధ్యాహ్నం సూరయ్య ఇంటి సమీపంలోని పాడుబడిన బావిలో తేజశ్రీ మృతదేహం తేలింది. పశువుల మేపుకోవడానికి వచ్చిన వారు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని పెడన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేంద్రప్రసాద్‌ పరిశీలించారు. జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు విచారణ చేపట్టారు. గత కొన్ని రోజులుగా ఆమె మానసికంగా ఇబ్బందులు పడుతుందని, ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): రైళ్లలో తిరుగుతూ ప్రయాణికుల దగ్గర సెల్‌ఫోన్లు చోరీ చేసే దొంగను రైల్వే పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే జీఆర్పీ సీఐ రమణ ఆధ్వర్యంలో సాధారణ తనిఖీల్లో భాగంగా సిబ్బంది ఆదివారం రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ క్రమంలో ప్లాట్‌ ఫాం నంబర్‌ 10, ఉత్తర దిక్కు వైపున ఉన్న ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి 45 ఏళ్ల షేక్‌ గౌసే అనే వ్యక్తి తారసపడ్డాడు. అతని నడవడికి అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు అతని వద్ద ఉన్న బ్యాగ్‌ను పరిశీలించగా అందులో 13 సెల్‌ఫోన్లు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు షేక్‌ గౌసే విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్‌లోని మసీదురోడ్డులో నివాసిగా గుర్తించారు. అతడిని అరెస్ట్‌ చేసి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సొత్తు విలువ సుమారుగా రెండు లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement