కోనేరుసెంటర్: మచిలీపట్నంలో మైనర్ బాలికలకు మాయమాటలు చెప్పి లైంగికదాడికి పాల్పడిన ఇద్దరు నిందితులను మచిలీపట్నం పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన కథనం ప్రకారం బందరు మండలం శారదానగర్‌కు చెందిన మద్దాల శ్యామ్‌కిరణ్, కొక్కిలిగడ్డ సిద్ధులు స్నేహితులు, ఈ నెల 6న పెడన మండలం బల్లిపర్రు గురుకులం పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు మైనర్ బాలికలు హాస్టల్ నుంచి బయటికి వచ్చి మచిలీపట్నంలోని కోనేరుసెంటర్‌కు చేరుకున్నారు. అనంతరం వారిలో ఓ బాలిక ఆటోడ్రైవర్ శ్యామ్‌కిరణ్‌కు ఫోన్ చేసి తాము కోనేరుసెంటర్ ఉన్నట్లు చెప్పింది. శ్యామ్‌కిరణ్ తన స్నేహితుడు సిద్ధును ఆటోలో ఎక్కించుకుని కోనేరుసెంటర్‌కు వెళ్లాడు. అక్కడ ఉన్న బాలికలను ఆటోలో ఎక్కించుకుని బందరు మండలం రుద్రవరంలోని టిడ్కో గృహాల వద్దకు తీసుకువెళ్లి మాయమాటలు చెప్పారు. ఇద్దరినీ ఖాళీగా ఉన్న ప్లాట్‌లోకి తీసుకువెళ్లి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం శారదానగర్‌లో వాళ్ల ఇంటి వద్ద దింపి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఇద్దరిలో ఓ బాలిక అస్వస్థతకు గురైంది. తల్లిదండ్రులు బాలికపై అనుమానంతో ఆరా తీయగా జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆటో డ్రైవర్లపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న ఆర్‌పేట పోలీసులు దర్యాప్తులో భాగంగా సోమవారం శ్యామ్‌కిరణ్, సిద్ధులను టిడ్కో గృహాల వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించారు. బాలికలను తరలించిన ఆటోను సీజ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితులను సోమవారం కోర్టుకు హాజరుపరచగా న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. సమావేశంలో బందరు ఇన్‌చార్జి డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్‌పేట సీఐ కె.ఏసుబాబు, పెడన సీఐ కె.నాగేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


