మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో సోమవారం నిర్వహించిన ఏపీ టెట్–2026 పరీక్షకు 86.67 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. నందమూరులోని శ్రీ వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో మధ్యాహ్నం సెషన్–2 పరీక్ష జరిగిందన్నారు. మొత్తం 90 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, 78 మంది హాజరయ్యారని, 12 మంది గైర్హాజరయ్యారని చెప్పారు.
భవానీపురం (విజయవాడ పశ్చిమ): గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, నృత్యరీతులను పరిరక్షించడంతోపాటు గిరిజన విద్యార్థుల విద్య, యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం సమప్రాధాన్యమిస్తోందని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.మల్లికార్జుననాయక్ పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ, గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ మిషన్ ఆధ్వర్యాన సోమవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్, ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఇందులో గిరిజన కళాకారులు సంప్రదాయ నృత్యాలు, కళారూపాలు ప్రదర్శించారు. అనంతరం మల్లికార్జున నాయక్ మాట్లాడుతూ.. విద్యా ప్రమాణాలు మెరుగుపరుస్తున్నామని, అవసరమైనవి అందజేస్తున్నామన్నారు.


