చిలకలపూడి(మచిలీపట్నం): సర్ ప్రక్రియలో భాగంగా ఇటీవల విడుదల చేసిన ఓటర్ల ముసాయిదా జాబితా సమగ్రంగా లేదని తప్పుల తడకగా ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. కలెక్టరేట్‌లోని ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం రాత్రి ఆర్డీవో కె.సాంబశివరావుకు ముసాయిదా జాబితాలో ఉన్న వివరాలను ఆయనకు తెలిపారు. పేర్ని నాని మాట్లాడుతూ సర్ ప్రక్రియ నిర్వహించిన తర్వాత ముసాయిదా జాబితా ఓటర్ల లిస్ట్ పాత ఫొటోలు, పేర్లు మార్పులు జరగకుండానే విడుదల చేశారని.. ఒక ఓటరుకు రెండు చోట్ల ఎపిక్ నంబర్లు ఉన్నట్లు తాము గుర్తించామని తెలిపారు. రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గంలో 19 పోలింగ్ బూత్‌లు పెంచారని, ఈ పోలింగ్ బూత్‌లలో ఓటర్ల మార్పులు, చేర్పుల్లో కొంత మంది ఓటర్లకు ఏ పోలింగ్ బూత్‌లో తాము ఉన్నామో అర్థంకాక ఆందోళన చెందుతున్నారన్నారు. తమ అభ్యంతరాలు, క్లయిమ్‌లను పరిశీలించి సమగ్రంగా ఓటర్ల తుది జాబితాను విడుదల చేయాలని పేర్ని నాని ఆర్డీవోను కోరారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పల్లి శేఖర్, తిరుమలశెట్టి ప్రసాద్, కాగిత జవహర్‌లాల్ (బున్ని), వైఎస్సార్ సీపీ నాయకులు మొహమ్మద్ రఫీ పాల్గొన్నారు.


