సివిల్ జడ్జి వరలక్ష్మి
కోనేరుసెంటర్: సమాజంలో డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టటంలో యువత మరింత ముందుండాలని సివిల్ జడ్జి ఎస్. వరలక్ష్మి పిలుపునిచ్చారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ‘మాదకద్రవ్యాల వినియోగం, వాటి పర్యావసానాలు’ అనే అంశంపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వల్ల ముఖ్యంగా యువత చెడునడతకు అలవడుతుందన్నారు. తద్వారా అనేక అనర్థాలు చూడాల్సి వస్తోందన్నారు. డ్రగ్స్ మహమ్మారిపై యువత ఉక్కుపాదం మోపాలన్నారు. బందరు ఇన్‌చార్జ్ డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ మాదకద్రవ్యాలను నియంత్రణకు పోలీసుశాఖ నిరంతరం కృషి చేస్తోందన్నారు.
వ్యసనాల జోలికి పోవద్దు..
వర్సిటీ ఉపకులపతి ఆచార్య కె. రాంజీ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో యువత ఎటువంటి వ్యసనాల జోలికి పోకుండా భవిష్యత్తు మీద దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో మై భారత్ ఎన్టీఆర్ జిల్లా యువజన అధికారి బి. ప్రదీప్ కుమార్, ఆర్‌పేట సీఐ ఏసుబాబు, ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయకర్త డాక్టర్ ఎం. శ్రావణి, న్యాయవాది సీహెచ్ ముసలయ్య తదితరులు పాల్గొన్నారు.
మచిలీపట్నం అర్బన్: జిల్లాలో ఏపీ టెట్–2026కు శుక్రవారం రెండు సెషన్లలో కలిపి 94.98శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. నందమూరులోని శ్రీ వాసవీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, పెనమలూరు మండలం కానూరు గ్రామంలోని ఐఓఎన్ డిజిటల్ జోన్ ఐడీజెడ్ పరీక్ష కేంద్రాల్లో మొదటి సెషన్‌లో మొత్తం 1,640 మంది అభ్యర్థులకు పరీక్ష నిర్వహించారు. వీరిలో 1,499మంది హాజరుకాగా, 141మంది గైర్హాజరయ్యారు. హాజరు శాతం 94.41గా నమోదైనట్లు తెలిపారు. రెండో సెషన్‌లో శ్రీ వాసవీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ పరీక్ష కేంద్రంలో 90మంది అభ్యర్థులకు పరీక్ష నిర్వహించగా, 86మంది హాజరయ్యారు. నలుగురు గైర్హాజరయ్యారు. హాజరు శాతం 95.56గా నమోదైంది. రెండు సెషన్ల సగటు హాజరు శాతం 94.98గా ఉందని తెలిపారు.
ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు..
ఏపీ టెట్ సందర్భంగా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. మచిలీపట్నం డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ బీఎస్సీ శేఖర్ సింగ్ శ్రీ వాసవీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ పరీక్ష కేంద్రాన్ని, గుడివాడ డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కె. రవికుమార్ ఐఓఎన్ డిజిటల్ జోన్ ఐడీజెడ్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. తనిఖీల్లో ఎలాంటి ప్రతికూల అంశాలు గుర్తించలేదని అధికారులు తెలిపారు.


