కూరగాయలు, ఆకుకూరల సాగుతో లాభాలు విత్తనాలు, పురుగుమందుల ఖర్చు సున్నా సొంతంగా సేంద్రియ ఎరువుల తయారీ పెనుగంచిప్రోలులో ఆదర్శంగా నిలుస్తున్న రైతు
నీటి కొరతను జయించి ‘ప్రకృతి’ విప్లవం
ఆరోగ్యకరమైన ఉత్పత్తులే లక్ష్యం..
పెనుగంచిప్రోలు: వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పత్తి, మిరప పంటలు సాగు చేస్తే కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి. దీంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అయితే జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన షేక్ రంజాన్ రమేష్ సరికొత్త పంథాలో సాగు చేపడుతున్నాడు. గతంలో ఇతర పంటలు సాగు చేసిన అతను కొంతకాలంగా పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు. ఒక ఎకరం పొలంలో ఏకంగా 17 రకాల పంటలు సాగు చేస్తూ.. అవసరమైన రైతులకు ప్రకృతి వ్యవసాయంపై సూచనలు, సలహాలు ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
17 రకాలు.. ఏడాది పొడవునా
ఎకరం పొలం కౌలుకు తీసుకుని ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర పాలకూర, చుక్కకూర, బచ్చలకూర, మెంతుకూరతో పాటు దోస, బెండ, కాకర, పొట్లకాయ, బీన్స్, బీర, ముల్లంగి, బొబ్బర్లు, గోరు చిక్కుడు, తీగ చిక్కుళ్లను ఎకరం పొలంలోనే సాగు చేస్తూ నిరంతరం ఆదాయం పొందుతున్నాడు. ఒక పంట కాపు అయిపోతుందనుకుంటే వెంటనే దానిని పీకి తిరిగి అవే విత్తనాలు నాటుతాడు. పీకేసిన పంట ఆకులను కూడా పడేయకుండా మల్చింగ్ విధానంలో వలె భూమి మీద కప్పి ఉంచుతాడు. అవి భూమిలోనే కుళ్లిపోయి ఎరువుగా కూడా ఉపయోగ పడుతుంది. ఈవిధంగా ఏడాది పొడవునా పొలంలో ఆకుకూరలు, కూరగాయలు సాగు జరుగుతూనే ఉంటుంది.
పొలం దగ్గరకే రైతులు, వినియోగదారులు..
రమేష్ తను ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులను ఎక్కడికో వెళ్లి మార్కెట్ చేసుకోకుండా వ్యవసాయ క్షేత్రం వద్దకు రైతులతో పాటు వినియోగదారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. సేంద్రియ ఉత్పత్తులకు అధిక ధరలు వసూలు చేయకుండా మార్కెట్ ధరకు లేదా అంతకన్నా రూ.2 నుంచి రూ.5 తక్కువకు విక్రయిస్తున్నామని వివరిస్తున్నారు.
పొలంలోనే సేంద్రియ ఎరువుల తయారీ...
రమేష్ తన పొలంలో గోమూత్రం, గోవు పాలు, శనగపిండి పెరుగు, బెల్లం, పుట్టమన్ను పులియబెట్టి జీవామృతం తయారు చేసి పొలానికి నీళ్లు పెట్టేటప్పుడు భూమిలో పారేలా వేస్తారు. అలాగే ఆవుపేడ, మూత్రం, బెల్లం కలిపి పొడిలాగా చేసి పైపంటపై చల్లుతారు. తెగుళ్లు, పురుగుల నివారణకు వేప కాషాయంతో స్ప్రే చేస్తారు. ఇలా ఎటువంటి రసాయనాలు వాడకుండా పూర్తిగా ఆరోగ్యవంతమైన ఆకుకూరలు, కూరగాయలు పద్ధతులు అవలంబిస్తున్నారు. పందిరి విధానంలో పొట్ల, బీర, కాకర సాగు చేస్తూ ప్రకృతి వ్యవసాయంపై తనకున్న మక్కువను తెలియజేస్తున్నారు.
సాగులో నూతన పద్ధతుల కోసం ప్రకృతి వ్యవసాయంతో ఆకుకూరలు, కూరగాయల సాగు చేస్తున్నాను. ఆరోగ్యకర ఉత్పత్తులు అందించటంలో నా వంతు కృషి చేస్తున్నాను. నేను సాగు చేయటమే కాకుండా అవసరమైన రైతులకు సూచనలు, సలహాలతో పాటు అవగాహన సమావేశాల్లో కూడా పాల్గొంటాను. ఎకరానికి రూ.లక్ష ఖర్చు పెడితే 2 నుంచి 3 నెలల్లోనే ప్రకృతి సహకరిస్తే రెట్టింపు ఆదాయం వస్తుంది. కావాల్సిన వారు పొలం వద్దకే వచ్చి ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారు. తక్కువ నీటి వసతి ఉన్న సమయంలో కూరగాయల సాగు రైతుకు లాభదాయకంగా ఉంటుంది.
– షేక్ రంజాన్ రమేష్, రైతు,
పెనుగంచిప్రోలు


