గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో తల్లికి వందనం పథకంపై ఫిర్యాదుల స్వీకరణకు ఈనెల 7వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాబితాలో అర్హుల పేరు లేకపోవడం, వివరాల్లో ఏవైనా తప్పులు ఉండడం, అనర్హులుగా చూపడం, ఇతర ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత గ్రామ, వార్డు సచివాలయంలో సంప్రదించాలని కోరారు. తమ అభ్యంతరాలపై ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చన్నారు. తమకు అందిన ప్రతి ఫిర్యాదును ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిశీలించి, అర్హత ప్రమాణాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
పెనమలూరు: పెనమలూరు వంతెన వద్ద బందరు కాలువలో గల్లంతైన యువకుడు నూకరాజు మృత దేహం లభ్యమైంది. ఎస్‌డీఆర్‌ఎఫ్ తీవ్రంగా గాలించటంతో గంగూరు గ్రామ పరిధి బందరు కాలువలో మృతదేహం కనబడటంతో స్వాధీనం చేసుకున్నారు. అలాగే మంగళవారం కాలువులో కొట్టుకు వచ్చిన మరో మృతదేహాన్ని కూడా పోలీసులు బయటకు తీశారు. బందరు కాలువలో మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని మృతదేహం కొట్టుకు రావటంతో మృతదేహం వెలికి తీయటానికి పెనమలూరు గ్రామానికి చెందిన నూకరాజు కాలువలో దిగి గల్లంతయ్యాడు. కాలువలో గుర్రపు డెక్క విపరీతంగా ఉండటంతో ఈత కొడుతూ నూకరాజు కాలువ లో అదృశ్యమయ్యాడు. దీంతో బుధవారం ఎస్డీ ఆర్‌ఎఫ్ బృందం రంగంలోకి దిగి బందరు కాలువలో గాలింపు చేపట్టారు. కంకిపాడు లాకుల వద్ద నీరు పారుదల జరగకుండా లాకులు కట్టించి కాలువలో విస్తృతంగా గాలింపు చేశారు. చివరకు గంగూరు కరెంట్ ఆఫీస్ వెనుక బందరు కాలువలో నూకరాజు మృతదేహం కనబడింది.. ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం మృతదేహాన్ని పోలీసులకు స్వాధీనం చేశారు.
మరో మృతదేహం కూడా..
కాగా బందరు కాలువలో మంగళవారం నీటి ప్రవాహంలో కొట్టుకు వచ్చిన మృతదేహం పెనమలూరు వంతన వద్ద గుర్రపు డెక్కలో నిలిచిపోయింది. బుధవారం ఉదయం ఎస్‌ఐ తాతాచారి ఆధ్వర్యంలో కాలువలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి వయస్సు 35 నుంచి 40 మధ్య ఉంటుందని, మృతుడు నీలం రంగు జీన్‌ప్యాంట్, తెలుపురంగు టీషర్ట్ వేసుకున్న మగ వ్యక్తి అని ఎస్‌ఐ తెలిపారు. సమాచారం తెలిసిన వారు 9618336684కు ఫోన్ చేసి వివరాలు తెలపాలని ఎస్‌ఐ కోరారు.
చల్లపల్లి: ిసంగిల్‌యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు చేపట్టనున్న ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ కోరారు. బుధవారం ఆయన స్థానిక వ్యాపారులతో కలిసి పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ క్యారీబాగ్‌లు, ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ కప్పులు వంటి సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ వస్తువులను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పూర్తిగా నిషేధిస్తున్నట్లు తెలిపారు. అందుకు వ్యాపారులు, ప్రజలు అందరూ సహకరించాలని కోరారు. స్వచ్ఛ చల్లపల్లి గ్రామంలోనే ఈ మార్పుకు నాంది పలకాలనే ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఇక్కడ అమలు చేస్తున్నట్లు వివరించారు. జిల్లా పంచా యతీ అధికారి జి.ధనలక్ష్మి, స్వచ్ఛ చల్లపల్లి రథసారథి తదితరులు పాల్గొన్నారు.


