గిరిపురంలో పది రోజులుగా రంగుమారిన తాగునీరు సరఫరా ప్రజలు ఫిర్యాదులు చేసినా పట్టించుకోని వైనం డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ మోటార్లు పనిచేయక పొంగుతున్న మ్యాన్‌హోల్స్ దీంతో డయేరియా బారిన పడిన 20 మంది ప్రజలు
పేదల కాలనీపై నిర్లక్ష్యం తగదు
విజయవాడ నగరపాలక సంస్థలో నిర్లక్ష్యం వేళ్లూనుకుపోయి వటవృక్షంలా తయారైంది. ప్రధానంగా ప్రజారోగ్యం గురించి పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. గత ఏడాది న్యూ ఆర్‌ఆర్ పేట ఘటనలు మరువక ముందే మళ్లీ ఈ ఏడాది గిరిపురంలో వీఎంసీ నిర్లక్ష్యానికి ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. పది రోజులుగా రంగుమారిన తాగునీరు వస్తుందని ప్రజలు మొత్తుకుంటున్నా పట్టించుకోకపోవడంతో దాదాపు 20 మంది వరకు మంచాన పడ్డారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారింది. మంచినీటి కుళాయిల నుంచి రంగు మారిన నీరు వస్తున్నాయని ప్రజలు ఫిర్యాదులు చేసినా అధికారులు పెడచెవిన పెట్టారు. పేదలు నివసించే కాలనీయే కదా అని చిన్నచూపేమో... పట్టించుకోలేదు. దీంతో వారం రోజులుగా ఒక్కొక్కరుగా ఆ ప్రాంత ప్రజలు డయేరియా బారిన పడుతూ ఆస్పత్రుల దారి పట్టారు. వారిలో ఒకరిద్దరు ప్రాణాపాయ స్థితి వరకూ వెళ్లి కోలుకున్నారు.
గత ఏడాది న్యూ ఆర్‌ఆర్‌పేటలో...
గత ఏడాది నగరంలోని న్యూ ఆర్‌ఆర్‌పేటలో ఏకంగా 300 మందికి పైగా డయేరియా బారిన పడ్డారు. ఆ ఘటన తర్వాత కూడా అధికారుల్లో ఏ మాత్రం చలనం లేదు. రంగునీరు వస్తున్నాయని ప్రజలు మొత్తుకుంటున్నా పాలకులు పెడచెవిన పెట్టారు. దీంతో గత ఏడాది రీతిలోనే ఇప్పుడు గిరిపురం ప్రాంత వాసులు డయేరియా బారిన పడ్డారు. ఆ ప్రాంతంలో దాదాపు 20 మంది వరకూ బాధితులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఆర్వో వాటర్ సరఫరా
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వీఎంసీ అధికారులు వ్యవహరిస్తున్నారు. రంగు నీళ్లు వస్తున్నాయి సరిదిద్దండీ అంటే పట్టించుకోని అధికారులు, ఇప్పుడు డయేరియా సోకిన తర్వాత ఇంటింటికీ ఆర్వో వాటర్‌ను సరఫరా చేస్తున్నారు. గిరిపురంలో డయేరియా సోకిన మూడు వీధులతో పాటు, పరిసర ప్రాంతాల్లో సైతం ఆర్వో వాటర్ క్యాన్‌లు ఆటోల్లో తీసుకు వచ్చి సరఫరా చేస్తున్నారు. దీంతో స్థానికులు బిందెలతో తీసుకు వెళ్తున్నారు.
ఎక్కడ చూసినా అపరిశుభ్రతే...
గిరిపురంలోని డ్రైనేజీలు ఎక్కడ చూసినా అపరి శుభ్రంగా, కంపుకొడుతూ దర్శనం ఇస్తున్నాయి. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గిరిపురం ఒకటి. ఆ ప్రాంతంలో వీఎంసీ పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా వదిలేశారు. దీంతో ఎక్కడ చూసినా డ్రైన్లు వ్యర్థాలతో నిండిపోయాయి. పరిసరాల అపరిశుభ్రత కూడా డయేరియాకు దారితీసి ఉండవచ్చునని భావిస్తు న్నారు. శానిటేషన్ సిబ్బంది కేవలం రోడ్లు శుభ్రం చేస్తున్నారే కానీ, డ్రైన్‌లను పట్టించుకోవడం లేదని, దీంతో అవి మురుగు కూపాలుగా మారుతున్నట్లు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ మోటార్లు పనిచేయక పోవడంతో తరచూ మ్యాన్‌హోల్స్ నుంచి మురుగు పొంగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటి కై నా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
ఈ ప్రాంతంలో రంగు మారిన నీళ్లు వస్తున్నట్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోక పోవడం వలనే ప్రజలు డయేరియా బారిన పడ్డారు. వారం రోజుల నుంచి ఈ ప్రాంతంలో డయేరియా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు వచ్చి అధికారులు హడావుడి చేస్తున్నారు. ముందుగానే స్పందించి ఉంటే డయేరియా సోకేది కాదు. డ్రైన్లు మురుగు కూపాలుగా మారాయి. వాటిని వీఎంసీ పట్టించుకోవడం లేదు. పేదల కాలనీల పట్ల పాలకులకు నిర్లక్ష్యం తగదు. – కుక్కల అనిత, మాజీ కార్పొరేటర్


