దుర్గమ్మకు సారె సమర్పించిన 30కు పైగా భక్త బృందాలు మూడో రోజు శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ అంతరాలయ దర్శనం రద్దు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆషాఢ మాసోత్సవాలు, ఆషాఢ సారె సమర్పణ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆషాఢ మాసోత్సవాలలో మూడో రోజు శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ కొనసాగింది. ఉదయం 8 గంటల నుంచి అమ్మవారికి సారె సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్త బృందాలు ఆలయానికి తరలివచ్చాయి. దీంతో అమ్మవారి దర్శనానికి అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం 9 గంటల నుంచి అంతరాలయ దర్శనం నిలిపివేసిన అధికారులు, సాధారణ భక్తులతో పాటు సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్త బృందాలకు బంగారువాకిలి, రూ.100 టికెట్ క్యూలైన్‌లో అమ్మవారి దర్శనానికి అనుమతించారు. శుక్రవారం మొత్తం 30కి పైగా భక్త బృందాలు అమ్మవారికి సారె సమర్పించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. పాల పొంగలి, పసుపు, కుంకుమ, పూజా సామగ్రి, చీర, రవిక, పండ్లతో మహిళలు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకున్నారు. సారె సమర్పించే భక్తులకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకు త్వరితగతిన సారె సమర్పించేలా చర్యలు తీసుకుంది. సారె సమర్పించిన అనంతరం మహామండపం రెండో అంతస్తులో భక్తులకు అమ్మవారి అన్నప్రసాదాన్ని అందజేశారు. కృష్ణలంక బాలాజీనగర్‌కు చెందిన భవానీ భక్త బృందం వారు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారికి సారె సమర్పించారు.
మహా నివేదన తర్వాత పెరిగిన రద్దీ
శుక్రవారం, ఆషాఢం సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. మరో వైపున ఉదయం 11–40 గంటలకు అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు అన్ని దర్శనాలు నిలిపివేశారు. మహా నివేదన అనంతరం తిరిగి 12–20 గంటలకు అన్ని దర్శనాలు ప్రారంభం కాగా, మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవ, దర్బారుసేవల్లో ఉభయదాతలు పాల్గొన్నారు.


