దుర్గమ్మ అన్నదానానికి విరాళాలు | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ అన్నదానానికి విరాళాలు

Jul 18 2026 9:45 AM | Updated on Jul 18 2026 9:45 AM

దుర్గమ్మ అన్నదానానికి విరాళాలు జీజీహెచ్‌లో కోవిడ్‌ వార్డు కోవిడ్‌పై ఆందోళన వద్దు కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన లఘు ఉద్యోగ భారతి బృందం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి శుక్రవారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. విశాఖపట్నం ఇందిరాగాంధీ నగర్‌కు చెందిన సజ్జా రాధాకృష్ణ తన భార్య శోభారాణి, కుమార్తె మాలిని పేరిట అన్నదానానికి రూ.1,01,116 విరాళాన్ని డెప్యూటీ ఈవో కిషోర్‌కుమార్‌కు అందజేశారు. ఆగిరిపల్లికి చెందిన శివపార్వతి తన భర్త పత్తిపాటి సాంబశివప్రసాద్‌ పేరిట అన్నదానానికి రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో కోవిడ్‌ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో విజయవాడ జీజీహెచ్‌లో కోవిడ్‌ వార్డు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా క్యాజువాలిటీకి అనుబంధంగా ఉన్న హెచ్‌డీయూలో 15 పడకలతో వార్డును సిద్ధం చేశారు. క్రిటికల్‌ కేసులకు చికిత్స అందించేందుకు మరో ఆరు పడకల ఐసీయూను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకూ 47 మందికి కోవిడ్‌ పరీక్షలు చేయగా, అందరికీ నెగటివ్‌ వచ్చినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రఘునందన్‌ తెలిపారు. కోవిడ్‌ నోడల్‌ అధికారిగా పల్మొనాలజీ విభాగాధిపతి డాక్టర్‌ సుదీనా వ్యవహరించనున్నారు. హెచ్‌డీయూ వార్డును ఎమర్జెన్సీ మెడిసిన్‌కు చెందిన డాక్టర్‌ నూరుల్లా, ఇతర వైద్యులు పర్యవేక్షిస్తారు.

డయేరియాకు వార్డు సిద్ధం

నగరంలోని గిరిపురంలో డయేరియా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డును సిద్ధం చేశారు. డయేరియా కేసులు వస్తే ఆ వార్డులో ఉంచి చికిత్స అందించేందుకు సన్నద్ధం చేశారు.

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశ

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): రాష్ట్రంలో కోవిడ్‌ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండి అవసరమైన ముందు జాగ్రత్తలు పాటించాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశ శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తోందని, ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. ముందు జాగ్రత్తగా విజయవాడ జీజీహెచ్‌లో 15 పడకలతో ప్రత్యేక కోవిడ్‌ వార్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస సంబంధిత ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యుల సలహా తీసుకోవాలని సూచించారు. వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని కలెక్టర్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రానికి చెందిన లఘు ఉద్యోగ భారతి ప్రతినిధి బృందం గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. ఈ సందర్భంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రభావితం చేసే ముఖ్యమైన పలు సమస్యలపై ఆమెకు వినతిపత్రం అందించినట్లు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు తులసి యోగేష్‌ తెలిపారు. ఎంఎస్‌ఎంఈ తయారీదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ వినతిపత్రంలో ప్రస్తావించారు. ఎంఎస్‌ఎంఈ వినియోగదారుల కోసం తగిన ఫాస్ట్‌ట్రాక్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, సంస్థ ప్రతినిధులు వెలగపూడి సాంబశివరావు, చాముండేశ్వరి, తరుణ్‌ కాకాని తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement