భారీగా పెరిగిన ఎరువుల ధరలు ఈ భారం మోయలేమంటున్న రైతులు ఆక్వా రైతులకు అందని సూపర్, పొటాష్
పొటాష్
కృత్తివెన్ను: నమ్ముకున్న భూమిని వదల్లేక.. అప్పుల పాలవుతున్నా.. పుస్తెలు తెగనమ్మయినా పంట పండించాలన్న రైతులకు భారీగా పెరిగిన ఎరువుల ధరలు మోయలేని భారంగా మారాయి. కాలువల్లో సాగు నీరు ఇంకి పోయింది. వర్షాలు కురవక రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. నెర్రెలతో నోళ్లు తెరిచిన పంటపొలాలకు సాగు నీరు అందించేందుకు రైతులు నానాపాట్లు పడుతున్నారు. మరో వైపు పెరిగిన ఎరువుల ధరలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొన్ని రకాల ఎరువుల ధరలు 50 శాతానికి పైగా పెరిగాయి. ఫలితంగా సాగు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో దాదాపు 5,47,525 ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ ఖరీఫ్‌లో సాగు చేస్తున్న రైతులకు ప్రస్తుతం పెరిగిన ఎరువుల ధరలు తీవ్ర ఆందోళన కలిస్తున్నాయి. గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం కాంప్లెక్స్ ఎరువుల రేట్లు అధికంగా పెరిగాయని రైతులు వాపోతున్నారు. యూరియా, డీఏపీ ధరలు మాత్రం యథాతథంగానే ఉన్నాయి.
పెరిగిన ధరలతో కుదేలు
గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది పెరిగిన ఎరువుల ధరలు రైతుకు ఎకరానికి రూ.8,600 నుంచి రూ.10 వేలు అదనంగా భరించాల్సి వస్తోంది. అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువులు మూడు నుంచి నాలుగు కట్టలు వేస్తారు. వాటిలో అరకట్ట చొప్పున యూరియా కలుపుతారు. పెరిగిన ధర లతో 20–20 రకం ఎరువుకు ఎకరాకు రూ.3 వేలు, 14–35 రకానికి రూ.2 వేలు, 10–26 రకానికి రూ.2 వేలు, 28–28 రకానికి రూ.1600 చొప్పున అదనంగా రైతులు భరించాల్సి వస్తోంది. ప్రస్తుతం సాగునీరు లేకపోవడంతో ఆయిల్ ఇంజిన్లతో వరి నారుమడులకు నీటి తడులు అందిస్తున్నారు. ఆయిల్ ఖర్చు, ఇంజిన్ అద్దెకు ఎకరాకు రూ.3 వేల వరకు తమపై అదనపు భారం పడుతోందని రైతులు వాపోతున్నారు.
సూపర్ ఫాస్ఫేట్
ఆక్వా రైతులు కూడా ప్రభుత్వానికి భూమి శిస్తులు చెల్లిస్తారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 1,44,702 ఎకరాల్లో చేపలు, రొయ్యలు సాగు చేస్తున్నారు. 1,07,970 ఎకరాలు అధికారిక ఆక్వాజోన్ పరిధిలో, 36,732 ఎకరాలు నాన్ ఆక్వాజోన్ పరిధిలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన యాప్ విధానంతో ఆక్వా రైతులకు కావాల్సిన ఎరువులు అందకుండా పోయాయి. ఆక్వా చెరువుల్లో నీరు ప్లాంటేషన్‌తో మేత విలువలు పెరగడంతో పాటు పోషకాలు వృద్ధి చెందడానికి సూపర్‌ఫాస్ఫేట్, పొటాష్ ఎరువులను ఉపయోగిస్తారు. గతేడాది వరకు ఈ ఎరువు లను కోరుకున్న ఆక్వా రైతులకు నేరుగా అందించేవారు. ప్రస్తుతం వచ్చిన యాప్ విధానంతో వ్యవసాయానికి మాత్రమే ఎరువులు అందిస్తు న్నారు. దీంతో ఆక్వా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కనీసం ప్రైవేటు ఎరువుల షాపుల్లో సైతం ఎరువుల దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో ఆక్వా రైతులు ఎరువులు అందక ఆందోళన చెందుతున్నారు. ఆక్వా రంగానికి సైతం కావాల్సిన ఎరువులను యాప్ ద్వారా అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఆక్వా రైతులకు ఎరువులు ఇవ్వకపోవడంపై ఫిషరీస్ ఏడీ జల్లా సీతారామరాజును వివరణ కోరగా.. యాప్ సమస్యతో రైతులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనని, దీనిపై కలెక్టర్‌కు నివేదించామని తెలిపారు.


