పట్టిసీమ నీటి రాకతో గతేడాది నిర్మాణ దశలో ఆగిపోయిన రిటైనింగ్ వాల్ నిర్మాణాలు, లైనింగ్ పనుల నిర్మాణాలు మునిగిపోయాయి. కొండపల్లి శాంతినగర్ వద్ద బుడమేరు డైవర్షన్ కెనాల్ గండ్లు పడిన ప్రదేశంలో ఎడమవైపు 8.65 మీటర్ల ఎత్తు, 1.4 మీటర్ల వెడల్పు, 500 మీటర్ల పొడవున, కుడి వైపు అంటే శాంతినగర్ వైపు ఇవే కొలతలతో 50 మీటర్ల పొడవున రిటైనింగ్ వాల్ నిర్మించాల్సి ఉంది. గతేడాది ఈ పనులు జరుగుతున్న సమయంలో పట్టిసీమ నీరు విడుదల చేయడంతో ఎడమవైపు 360 మీటర్లు పొడవున మాత్రమే రిటైనింగ్ వాల్ నిర్మించి జూన్ 9వ తేదీతో పనులను ఆపేశారు. ఎడమ వైపు 140 మీటర్లు పొడవున, కుడి వైపున యాభై మీటర్ల పొడవున నిర్మించాల్సిన రిటైనింగ్ వాల్ పనులను ఫిబ్రవరిలో ప్రారంభించాల్సి ఉంది. ఈ పనులను మే నెలలో ప్రారంభించడంతో పట్టిసీమ నీటి రాకతోనే మధ్యలోనే ఆగిపోయాయి. ఈ నిర్మాణాలకు వాడుతున్న ఇనుము సైతం నీటిలో నానుతుండడంతో భవిష్యత్తులో దీని సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది.


