కానూరు ఆటోనగర్‌లో ఐస్‌క్రీమ్‌ ఫ్యాక్టరీ దగ్ధం | - | Sakshi
Sakshi News home page

కానూరు ఆటోనగర్‌లో ఐస్‌క్రీమ్‌ ఫ్యాక్టరీ దగ్ధం

Jul 14 2026 4:41 AM | Updated on Jul 14 2026 4:41 AM

కానూరు ఆటోనగర్‌లో ఐస్‌క్రీమ్‌ ఫ్యాక్టరీ దగ్ధం రేపు ఐటీఐలో జనరల్‌ కౌన్సెలింగ్‌ ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి ప్రశ్న చానల్‌ ఫ్లాట్‌ యజమాని, సీఈఓలను విచారించిన పోలీసులు

పెనమలూరు: కానూరు కొత్త ఆటోనగర్‌లో శ్రీ విజయదుర్గ ఫుడ్స్‌(ఐస్‌క్రీమ్‌) ఫ్యాక్టరీ ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. రాత్రి సమయంలో ఫ్యాక్టరీలో హఠాత్తుగా మంటలు చెలరేగి ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించి మిషన్‌లు, ఫర్నిచర్‌, సరుకు అగ్నికి కాలి బూడిదయ్యాయి. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయని పోలీసులు భావిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆటోనగర్‌లో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేట్‌ ఐటీఐ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే మొదటి విడత కౌన్సెలింగ్‌లో దరఖాస్తు చేసుకుని సీటు రాని విద్యార్థులు, మొదటి విడత కౌన్సెలింగ్‌కు హాజరు కాని వారికి ఈ నెల 15వ తేదీ బుధవారం జనరల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని ఐటీఐ కౌన్సెలింగ్‌ ఎన్టీఆర్‌ జిల్లా కన్వీనర్‌ ఎం.కనకారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ రమేష్‌ ఆసుపత్రి రోడ్డులో ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి ఈ కౌన్సెలింగ్‌ ప్రారంభం అవుతుందన్నారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో భర్తీ కాగా మిగిలిన సీట్లను ఈ జనరల్‌ కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తామని తెలియజేశారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు పదో తరగతి మార్కుల జాబితా, టీసీ, కుల ధ్రువీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌ ఆధార్‌ కార్డు, స్టడీ సర్టిఫికెట్‌ అన్ని ఒరిజినల్స్‌తో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని తెలియజేశారు. వివరాలకు 0866–2475575, 94906 39639, 77804 29468 నంబర్లలో సంప్రదించాల్సిందిగా కోరారు.

కోనేరుసెంటర్‌: ద్విచక్ర వాహనం ఢీకొనటంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై చిలకలపూడి పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మచిలీపట్నం చిలకలపూడికి చెందిన మద్దూరి సూర్యప్రసాదరావు (53) కూలి పనులు చేస్తుంటాడు. ఆదివారం రాత్రి పనులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా చిలకలపూడి రైల్వేస్టేషన్‌కు సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన బైక్‌ సూర్యప్రసాదరావును ఢీకొంది. ఈ ఘటనలో బాధితుడికి బలమైన గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం హుటాహుటిన మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని కుమారుడు రమణసాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

గన్నవరం: యూ ట్యూబర్‌ ప్రశ్న రావణ్‌పై గన్నవరం పోలీస్‌స్టేషన్‌లో రాజద్రోహం, తదితర సెక్షన్ల కింద నమోదైన కేసులో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మేరకు ప్రశ్న చానల్‌ సీఈఓ గమన, ఆ చానల్‌కు ఫ్లాట్‌ను అద్దెకు ఇచ్చిన ఇంద్రసేననాయుడుకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. స్థానిక సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో ఈ కేసు విచారణాధికారి డీఎస్పీ కె.ధర్మేంద్ర నేతృత్వంలో వారిద్దరిని ఉదయం 11 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సుదీర్ఘంగా విచారించారు. మళ్లీ 17న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఇటీవల మాదాపూర్‌లోని స్డూడియోలో స్వాధీనం చేసుకున్న సాంకేతిక పరికరాలను గమన, ఇంద్రసేననాయుడు సమక్షంలోనే సీజ్‌ చేసి ఫోరెన్సిక్‌ పరీక్షల నిమిత్తం పంపించినట్లు తెలుస్తోంది. విచారణలో గన్నవరం సీఐ బీవీ శివప్రసాద్‌ పాల్గొన్నారు.

ఉద్యమ కార్యాచరణపై ఉద్యోగ సంఘాలతో సమావేశం

మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం అనంతరం ఉద్యమ కార్యాచరణపై తుది నిర్ణయం ప్రకటిస్తామని ఏపీ జేఏసీ అమరావతి ఎన్టీఆర్‌ జిల్లా కమిటీ ప్రకటించింది. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి ఎన్టీఆర్‌ జిల్లా నాయకులు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపడంపై కమిటీ హర్షం వ్యక్తం చేసింది. సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి ఎన్టీఆర్‌ జిల్లా జనరల్‌ సెక్రటరీ శ్రీనివాసరావు, చైర్‌పర్సన్‌ స్వరాజ్యలక్ష్మి, ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కోశాధికారి తిమ్మసర్తి నాగేశ్వరరావు, రాష్ట్ర మహిళా విభాగం చైర్‌పర్సన్‌ పారె లక్ష్మి, సెక్రటరీ జనరల్‌ పొన్నూరు విజయలక్ష్మి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement