తాడోపేడో తేల్చుకుంటాం! | - | Sakshi
Sakshi News home page

తాడోపేడో తేల్చుకుంటాం!

Jul 11 2026 7:07 AM | Updated on Jul 11 2026 7:07 AM

తాడోపేడో తేల్చుకుంటాం! అంగన్‌వాడీల నినాదాలతో దద్దరిల్లిన ధర్నా చౌక్‌

ఆ యాప్‌ తక్షణమే రద్దు చేయాలి

బందరులోని కలెక్టరేట్‌ ముట్టడికి యత్నం బారికేడ్లతో పోలీసుల అడ్డగింత, తోపులాటతో ఉద్రిక్తత కలెక్టర్‌తోనే మాట్లాడతామంటూ రోడ్డుపై బైఠాయింపు సర్ది చెప్పిన ఇన్‌చార్జి డీఆర్‌ఓ బీఎల్‌వో విధుల మినహాయింపు, నవచేతన యాప్‌ రద్దుకు వినతి

అంగన్‌వాడీల నినాదాలతో దద్దరిల్లిన ధర్నా చౌక్‌

మచిలీపట్నంఅర్బన్‌: సమస్యల పరిష్కారానికి ఎందాకై నా అంటూ అంగన్‌వాడీ కార్యకర్తలు కలెక్టరేట్‌ ధర్నా చౌక్‌ను హోరెత్తించారు. ఆంధ్రప్రదేశ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘చలో కలెక్టరేట్‌’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ భారీ సంఖ్యలో తరలివచ్చిన అంగన్‌వాడీలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా చౌక్‌లో నిరసన తెలిపిన అనంతరం ర్యాలీగా కలెక్టరేట్‌ ముట్టడికి దూసుకెళ్లారు. అప్పటికే అప్రమత్తంగానే ఉన్న పోలీసులు కలెక్టరేట్‌ సమీపంలో భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని అడ్డుకున్నారు. దీంతో అంగన్‌వాడీలు, పోలీసుల మధ్య కొద్దిసేపు తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. దీంతో కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తగ్గేదే లేదు..

‘డిమాండ్లు నెరవేరే వరకు కదిలేది లేదు.. కలెక్టర్‌తోనే మాట్లాడతాం.. తాడోపేడో తేల్చుకుంటాం‘అంటూ అంగన్‌వాడీలు రోడ్డుపై బైఠాయించారు. ‘బాబు రాజ్యం... దొంగల రాజ్యం‘ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. అక్కడికి చేరుకున్న బందరు డీఎస్పీ శ్రీనివాసరావు శాంతింపజేసేందుకు ప్రయత్నించినా, కలెక్టర్‌తోనే చర్చలు జరపాలని అంగన్‌వాడీలు స్పష్టం చేశారు. అనంతరం మరోసారి కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. కలెక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో ఇన్‌చార్జి డీఆర్‌వో కె. సాంబశివరావును అధికారులు అక్కడికి రప్పించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ నాయకులు కనీస వేతనం చెల్లించాలని, పెన్షన్‌, పీఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి సామాజిక భద్రతా సౌకర్యాల అమలు డిమాండ్లతో పాటు రెండు ప్రధాన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అంగన్‌వాడీలపై బీఎల్‌వో విధులను బలవంతంగా మోపే ప్రయత్నాలను నిలిపివేయాలని, పనిభారాన్ని పెంచుతున్న నవచేతన యాప్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశాలను జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఇన్‌చార్జి డీఆర్‌వో హామీ ఇవ్వడంతో వినతిపత్రం సమర్పించి ఆందోళన విరమించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీలు, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

హెల్పర్ల ప్రమోషన్లలో రాజకీయ జోక్యంతో అర్హులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొత్తగా అమలు చేస్తున్న ఐదేళ్ల సీనియారిటీ నిబంధనను రద్దు చేయాలి. పెండింగ్‌లో ఉన్న మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్‌ సెంటర్లుగా అప్‌గ్రేడ్‌ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పనిభారాన్ని పెంచుతున్న నవచేతన యాప్‌ను వెంటనే రద్దు చేయాలి.

– ఎ. రమాదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement