ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజామున అమ్మవారికి నిర్వహించిన ఖడ్గమాలార్చన, ఆలయ ప్రాంగణంలోని నూతన పూజా మండపంలో శ్రీచక్రనవార్చన, లక్ష కుంకుమార్చన, చండీహోమం, నవగ్రహ హోమం, శాంతి కల్యాణాలలో పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. మరోవైపున ఉదయం 9 గంటల తర్వాత ఆలయంలోని అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. సర్వ దర్శనానికి గంటన్నర సమయం, రూ.100, రూ.300 టికెట్ క్యూలైన్‌లో గంట సమయం పట్టింది. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన నిమిత్తం అరగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేశారు. దీంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. మధ్యాహ్నం 1.30 గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, దర్బారు సేవ, పల్లకీ సేవలలో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులను పల్లకీపై అమ్మవారి ప్రధాన ఆలయం చుట్టూ మూడు పర్యాయాలు ప్రదక్షిణలు నిర్వహించారు. ఈ సేవలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాత్రి 9.30 గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది.


