ఎదురుమొండి వారధి కోసం రోడ్డెక్కుతున్న మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు అవనిగడ్డ నుంచి నాగాయలంక వరకు నేడు పాదయాత్ర రాజకీయాలకు అతీతంగా తరలిరావాలని పిలుపు
అన్యాయం చేయొద్దు..
ఎదురుచూసి.. అలసిపోయి..
నాగాయలంక: మండలంలోని తీరప్రాంతంలోని ఎదురుమొండి ఈలచెట్లదిబ్బ దీవుల ప్రజల దశాబ్దాల కల సాకారం దిశగా గత ప్రభుత్వంలో పడిన అడుగులను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవనిగడ్డ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు పోరుబాట పట్టేందుకు సిద్ధమయ్యారు. రాజకీయాలకు అతీతంగా అవనిగడ్డ నుంచి నాగాయలంక వరకు దీవుల ప్రజలు అందరూ కలసిరావాలనే పిలుపుతో ఆయన శనివారం పాదయాత్ర చేపడుతున్నారు. దీవులపై చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ.. ఆయా పార్టీల నేతల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతూ.. ఆశల వారధిని సాధించుకుందామనే నినాదంతో ఆయన ముందుకు సాగనున్నారు.
నాడే తొలి అడుగు వేసిన వైఎస్ జగన్..
ఏళ్లుగా కలగానే మిగిలిన ఏటిమొగ–ఎదురుమొండి నడుమ కృష్ణానదిపై హైలెవల్ వంతెన నిర్మాణానికి వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తొలి అడుగు వేశారు. మాజీ శాసనసభ్యుడు సింహాద్రి రమేష్‌బాబు పలుమార్లు సమస్యను మాజీ సీఎంకు వివరించడంతో.. ఆయన దీవుల్లోని ప్రజల కల సాకారం చేసేందుకు కేంద్ర నాబార్డు రుణం మంజూరు చేయించడానికి కార్యాచరణ సిద్ధం చేశారు. పర్యవసానంగా ఆర్ అండ్‌బీ(బిల్డింగ్స్) చీఫ్ ఇంజినీర్ పీసీ రమేష్ కుమార్, నాబార్డు మేనేజర్ ఎం.స్మారక్, నాబార్డు కన్సల్టెంట్ అడ్వయిజర్ ప్రభాకరరావులతో కూడిన నాబార్డు అధికారిక బృందం 2022 మార్చి 26న నాగాయలంక మండలం ఎదురుమొండిలో పర్యటించారు. ఇక్కడి భౌతిక, భౌగోళిక పరిస్థితులను అంచనాతో వివిధ వర్గాల ప్రజలతో మమేకమై దీవుల్లో పరిస్థితులను అధ్యయనం చేశారు. గతంలో ఈ ప్రాంతంలో రెండు పర్యాయాలు జరిగిన భారీ పడవ ప్రమాదాల్లో 54మంది మృత్యువాత పడిన దుర్ఘటనలను, గుంటూరు జిల్లా కాలువల నుంచి సాగు, తాగునీటి కోసం నదీ గర్భంలో పైప్‌లైన్ల ద్వారా ఎదురుమొండిలోని 135ఎకరాల రిజర్వాయర్‌లోకి ఎత్తిపోతల పథకంతో నీటిని మళ్లించే పరిస్థితులను ఈ బృంద సభ్యులు పరిశీలించారు. ఇక్కడి వారధి అవసరాన్ని గుర్తించి రూ. 110కోట్లు మంజూరు చేశారు. ఈ నాబార్డు నిధులతో కృష్ణానదిపై ఎదురుమొండి–ఏటిమొగ గ్రామాల మధ్య వారధి నిర్మించేందుకు నాటి ప్రభుత్వం 2022ఏప్రిల్ 13న జీవో నంబర్ 101ని సైతం జారీ చేసింది. తదుపరి ఎన్నికలు రావడంతో ఆ పనులకు గత ప్రభుత్వం చేపట్టలేకపోయింది.
కూటమి డ్రామాలు..
కూటమి అధికారంలోకి రాగానే తొలి ప్రాధాన్యతగా ఎదురుమొండి వంతెన నిర్మాణ పనులు చేపడతామని ఎన్నికల్లో వాగ్దానాలు కుమ్మరించింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా రాజకీయ డ్రామాలు ఆడుతూ వారధి నిర్మాణాన్ని అటకెక్కించారు. దీవుల ప్రజానీకం అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఎదురుచూసి, అలసిపోయిన ప్రజల కోసం మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పోరుబాట పట్టేందుకు సన్నద్ధమయ్యారు. అవనిగడ్డ నుంచి నాగాయలంక వరకూ దీవుల ప్రజలతో పాటు నియోజకవర్గంలోని ఇతరులకు కూడా వంతెన ప్రాధాన్యం వివరించాలనే సంకల్పంతో ఈ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్ చేశారు.
రాజకీయ ప్రయోజనాలతో దీవుల ప్రజలకు అన్యాయం తలపెట్టొద్దొని ఎదురుమొండి వారధి నిర్మాణం కోసం నిరాహార దీక్షలకు సైతం వెనుకాడబోమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి సింహాద్రి రమేష్‌బాబు చెప్పారు. ప్రజా ఉద్యమాలను హైజాక్ చేయడంలో స్థానిక ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఎపుడో డాక్టరేట్ పట్టా పొందారని విమర్శించారు. ప్రయోజనం లేని రాజకీయ బూచితో జనాన్ని మభ్యపెట్టకుండా ఎదురుమొండి వారధి చేపట్టి పూర్తిచేసి ఆ ఘనకీర్తి ఏదో మీరే పొందండి కానీ ప్రజలకు అన్యాయం తలపెట్టడం సహేతుకం కాదన్నారు.


