పద్ధతి మార్చుకోండి.. లేకుంటే రిజైన్ చేసి వెళ్లిపోండి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో వైద్య సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ‘రోగులకు వైద్యం చేయడంలో నిర్లక్ష్యం పెరిగిపోయింది.. రోగులు, వారి బంధువులు ఏదైనా అడిగితే సిబ్బంది సమాధానం కూడా చెప్పడం లేదు.. మీ తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది.. పనితీరు మార్చు కోండి.. పనిచేయడం ఇష్టం లేకుంటే రిజైన్ చేసి వెళ్లిపోండి..’అంటూ విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యులు, వైద్య సిబ్బందిపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మికంగా ఆస్పత్రికి వచ్చిన ఆయన అవినీతి ఆరోపణలు వస్తున్న మహాప్రస్థానం వాహనాల వద్దకు వెళ్లి, వాటి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సెమినార్ హాలులో వైద్యులు, నర్సింగ్ సూపరింటెండెంట్, హెడ్ నర్సులతో సమావేశమయ్యారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా తమకు వచ్చిన ఫిర్యాదులను వారికి వివరించారు. కనీసం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు నర్సింగ్ సిబ్బంది సమాధానం కూడా చెప్పడం లేదని, హెడ్‌నర్సులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కఠిన చర్యలు తప్పవు..
వైద్య సిబ్బందిలో మార్పు రాకుంటే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రసూతి విభాగంపైనా అనేక ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. సేవలను నిత్యం పర్యవేక్షించాల్సిన వారు ఏమీ చేస్తున్నారంటూ ఆయన నిలదీశారు. తమకు వచ్చే ప్రతి ఫిర్యాదుపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కలెక్టర్ వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అప్పారావులతో పాటు పలువురు అధికారులు ఉన్నారు.
డీసీఎస్ ఆర్‌ఎంఓ సరెండర్..
మహాప్రస్థానం వాహనాలను కేటాయించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డెప్యూటీ సివిల్ సర్జన్ ఆర్‌ఎంఓ డాక్టర్ సూర్యమంగాదేవిని డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు సరెండర్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఓ మృతదేహానికి మహాప్రస్థానం కేటాయించక పోవడం వల్ల ప్రైవేటు అంబులెన్స్‌లో తరలించిన వైనంపై డీఎంఈ డాక్టర్ విష్ణువర్థన్ విచారణ జరిపి, ఇచ్చిన నివేదిక ఆధారంగా డాక్టర్ సూర్యమంగా దేవిని సరెండర్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.


