పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా అనుమతులు
బ్యాంకర్లు రుణాలు ఇవ్వాలి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల అనుమతులు మంజూరు చేసి ప్రోత్సహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని మీ కోసం సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల, పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సింగిల్ డెస్క్ పాలసీ కింద పరిశ్రమలు నెలకొల్పేందుకు 1,496 దరఖాస్తులు రాగా అందులో 1,217 ఆమోదించి, ఒకటి తిరస్కరించారని, ఇంకా 278 దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. అందులో ప్రధానంగా తూనికలు కొలతల శాఖలో అత్యధికంగా 245, కాలుష్య నియంత్రణ మండలిలో 16, ఏపీఐఐసీలో తొమ్మిది ఉన్నాయన్నారు. వాటిని వెంటనే పరిష్కరించి అనుమతులు మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
● పీఎం విశ్వకర్మ పథకం కింద 2036 దరఖాస్తులు అందగా ఇప్పటివరకు 790 దరఖాస్తులకు ఆర్థిక సహాయం మంజూరు చేశారని, మిగిలిన దరఖాస్తులను కూడా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలన్నారు.
● పీఎంఈజీపీ పథకం కోసం 162 దరఖాస్తులు రాగా ఇప్పటివరకు కేవలం 43 యూనిట్లకు మాత్రమే బ్యాంకులు ఆర్థిక సహాయం మంజూరు చేశాయని, పరిష్కారం వేగవంతం చేయాలని బ్యాంకర్లకు సూచించారు.
● 23 ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి రూ. 88.16లక్షలు పెట్టుబడి రాయితీ, వడ్డీ రాయితీ, విద్యుత్తు రాయితీ ప్రోత్సాహకాలను మంజూరు చేశారన్నారు. డీఐసీ జీఎంఆర్ వెంకటరావు, డీఆర్డీఏ పీడీ హరినాథ్, ఏపీఐఐసీ జెడ్‌ఎం బాబ్జి, బీసీ కార్పొరేషన్ ఈడీ రాజేంద్రబాబు, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ వెంకటేశ్వరరావు, జిల్లా ఉద్యాన అధికారి జె. జ్యోతి, ఎల్‌డీఎం రవీంద్రారెడ్డి, జిల్లా ఉపాధి కల్పనాధికారి విక్టర్ బాబు, తూనికలు కొలతల తనిఖీ అధికారి ఈశ్వరరావు పాల్గొన్నారు.
కలెక్టర్ డీకే బాలాజీ
పీఎంఈజీపీ, పీఎంఎఫ్‌ఎంఈ వంటి ప్రభుత్వ పథకాలకు అత్యధిక ప్రాధాన్యతతో విరివిగా రుణాలు అందించి వ్యాపారాభివృద్ధికి తోడ్పడాలని కలెక్టర్ బ్యాంకర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని మీ కోసం సమావేశ మందిరంలో జిల్లా బ్యాంకర్ల సంప్రదింపుల సమితి సమావేశం, జిల్లా స్థాయి సమీక్ష సమావేశం బ్యాంకర్లు, జిల్లా అధికారులతో నిర్వహించి పలు పథకాల పురోగతిపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉపాధి హామీ కార్యక్రమం (పీఎంఈజీపీ) కింద 121 దరఖాస్తులు బ్యాంకులకు రాగా అందులో 30 దరఖాస్తులకు రూ. 1.65కోట్లు మంజూరు చేశారని, 11 తిరస్కరించారని, ఇంకా పెండింగ్‌లో ఉన్న 89 దరఖాస్తులను వెంటనే పరిశీలించి పరిష్కరించాలన్నారు. పీఎంఎఫ్‌ఎంఈ పథకం కింద 35 దరఖాస్తులు బ్యాంకుల వద్ద అపరిష్కృతంగా ఉన్నాయని వాటిని పరిష్కరించాలన్నారు. పీఎం సూర్య ఘర్ పథకం అమలులో రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో ఉందని, అందుకు కృషి చేసిన అధి కారులు బ్యాంకర్లను అభినందిస్తున్నామన్నారు.


