300 స్టాళ్లతో విజయవాడ పుస్తక మహోత్సవం
పోస్టర్ ఆవిష్కరించిన నిర్వాహకులు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో జనవరి రెండో తేదీ నుంచి ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగే 36వ విజయవాడ పుస్తక మహోత్సవంలో తెలుగు సాహిత్యంలో వస్తున్న వివిధ మార్పులపై పలు సదస్సులను నిర్వహించనున్నట్లు సొసైటీ గౌరవ సలహాదారు ఎమెస్కో పబ్లిషర్స్ అధినేత డి.విజయకుమార్ చెప్పారు. ఈ సందర్భంగా సొసైటీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అధ్యక్ష, కార్యదర్శులు టి.మనోహర్‌నాయుడు, కె.లక్ష్మయ్యతో కలిసి మాట్లాడారు. తొలుత బుక్ ఫెస్టివల్ కోసం ప్రత్యేకంగా సొసైటీ రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ పలు అంశాలపై సదస్సులతో పాటు స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు, ప్రముఖ విద్యావేత్త ఆచార్య తూమాటి దొణప్ప, సుప్రసిద్ధ కథ రచయిత మునిపల్లె రాజు తదితర ప్రముఖుల శతజయంతి సభలు నిర్వహిస్తామన్నారు. ఈ ఏడాది సుమారు 300 దుకాణాలతో పుస్తక మహోత్సవం ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌లను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఉపాధ్యక్షులు జె. ప్రసాద్, సహాయ కార్యదర్శి ఏబీఎస్ సాయిరామ్, కోశాధికారి కె. రవి తదితరులు పాల్గొన్నారు.


