కారు ఢీకొని ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు దుర్మరణం
మాజేరు చెక్‌పోస్టు జాతీయ రహదారిపై ప్రమాదం మృతుల్లో ఒకరికి రెండు నెలల కిందటే వివాహం మరొకరికి తొమ్మిది నెలల కిందట వివాహం కాగా ప్రస్తుతం ఆయన భార్య గర్భిణి రెండు గ్రామాల్లో విషాదఛాయలు
చల్లపల్లి: కారు టైరు పగిలి బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు దుర్మరణం చెందిన ఘటన మండలంలోని మాజేరు చెక్‌పోస్టు వద్ద 216 జాతీయ రహదారిపై మంగళవారం చోటుచేసుకుంది. మృతి చెందిన వారిలో ఒకరికి రెండు నెలల క్రితమే వివాహమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... గుడివాడకు చెందిన దొడ్డ లోకేశ్వర్ తన భార్య రమాగీత, రెండేళ్ళ వయస్సుగల బాబు గీతాన్ష్‌తో కలిసి కారులో మోపిదేవి గుడికి వెళ్లారు. తిరిగి జాతీయ రహదారిపై మచిలీపట్నం మీదుగా గుడివాడ బయలుదేరారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మాజేరు చెక్‌పోస్టు వద్దకు రాగానే కారు ముందుభాగంలోని డ్రైవర్ వైపు చక్రం పగిలిపోయింది. దీంతో అదుపుతప్పి రోడ్డుకు కుడివైపు కారు దూసుకుపోయింది. ఇంతలో ఎదురుగా మచిలీపట్నం నుంచి చల్లపల్లి వైపునకు వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న కోడూరు మండలం పిట్టలంక గ్రామానికి చెందిన సిరివెళ్ళ భాగ్యరాజు(24), పులిగడ్డకు చెందిన చెన్ను రాఘవ(25) మృతి చెందారు. భాగ్యరాజుకు బలమైన గాయాలు కావటంతో అక్కడికక్కడే చనిపోయాడు. చెన్ను రాఘవకు కుడిచేయి చంక భాగంలో తెగిపోవటంతో తీవ్రరక్తస్రావం అయింది. వెంటనే 108లో మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తుండగా మార్గమద్యంలో మృతి చెందాడు. భాగ్యరాజు, రాఘవ ఇద్దరూ పులిగడ్డ పంచాయతీ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ కింద కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. మంగళవారం ఆఫీసు పనిమీద మచిలీపట్నం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురై మృతి చెందారు. సిరివెళ్ళ భాగ్యరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వెంటనే కారులోని ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవటంతో అందులో ఉన్న లోకేశ్వర్‌కు ఆయన భార్య రమాగీత, చిన్నారి గీతాన్ష్‌కు ఎటువంటి గాయాలుకాలేదు. లోకేశ్వర్ పస్తుతం పోలీసుల అదుపులో ఉండగా ఎస్‌ఐ కె.వై.దాస్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. భాగ్యరాజుకు రెండు నెలల క్రితం అక్టోబర్ 7వ తేదీన వివాహం జరిగింది. కాళ్ళ పారాణి ఆరకముందే భాగ్యరాజు దుర్మరణం చెందాడు. పులిగడ్డకు చెందిన చెన్ను రాఘవకు తొమ్మిది నెలల క్రితం గాయత్రితో వివాహం అయ్యింది. ప్రస్తుతం ఆమె నాలుగు నెలల గర్భవతి. ఈ విషాద ఘటనతో రెండు కుటుంబాలు తీవ్ర దుఃఖసాగరంలో మునిగిపోవటంతో పాటు ఆయా గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.
కారు ఢీకొని ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు దుర్మరణం
కారు ఢీకొని ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు దుర్మరణం
కారు ఢీకొని ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు దుర్మరణం


