ఎస్‌ఎంసీలో బాలికల వసతి గృహం ప్రారంభం
కార్యక్రమంలో పాల్గొన్న వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల(ఎస్‌ఎంసీ)లో నిర్మించిన బాలికల వసతి గృహాన్ని మంగళవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 330మంది విద్యార్థినులు ఉండేలా 210 గదులతో భవనం నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేయగా, అందుకోసం రూ.21.51కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రారంభించిన వసతి గృహంలో 105 గదులు ఉన్నాయని, వాటిలో 80 గదులు యూజీ(ఎంబీబీఎస్) బాలికలకు, మిగిలిన వాటిని సీనియర్ రెసిడెంట్‌లకు ఇవ్వనున్నట్లు తెలిపారు. మిగిలిన నిర్మాణాలను త్వరలో పూర్తి చేసి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామన్నారు. వైద్య కళాశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, పీపీపీ విధానంలోనే మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు. నర్సింగ్ విద్యార్థుల వసతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, గద్దే రామ్మోహన్, కలెక్టర్ జి.లక్ష్మీశ, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ డి.వెంకటేష్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అన్నవరపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


