బెజ్జూర్, పెంచికల్‌పేట్ రేంజ్‌ల పరిధిలో కొత్త పులి సంచారం కదలికలపై దృష్టి సారించిన అటవీ శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తూనే.. బెబ్బులి సంరక్షణకు చర్యలు 20 ప్రత్యేక బృందాలతో ట్రాకింగ్
పెంచికల్‌పేట్: కాగజ్‌నగర్ డివిజన్‌లోని అటవీ ప్రాంతాల్లో కొన్ని నెలలుగా బెబ్బులి గాండ్రిపులు లేక పల్లెలు, అటవీ సమీప ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణం కొనసాగింది. ఈ తరుణంలో మహారాష్ట్రలోని అహెరి అటవీ ప్రాంతం నుంచి బెజ్జూర్, పెంచికల్‌పేట్ రేంజ్‌ల పరిధిలోకి ఓ పెద్దపులి అతిథిగా వచ్చింది. నాలుగైదు రోజులుగా ఇది స్థానిక ప్రాంతాల్లో చురుగ్గా తిరుగుతోంది. మూడు రోజుల క్రితం పెంచికల్‌పేట్– అగర్‌గూడ రహదారిపై కొందరు పులిని చూసి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. 20 ప్రత్యేక బృందాలతో అటవీ ప్రాంతంలో పాదముద్రలు, ట్రాప్ కెమెరాల ద్వారా కదలికలను గమనిస్తున్నారు. గతంలో కాగజ్‌నగర్, పెంచికల్‌పేట్ రేంజ్‌ల పరిధిలో పెద్దపులులు మరణించిన నేపథ్యంలో ఓ వైపు ప్రజలను అప్రమత్తం చేస్తూనే మరోవైపు పెద్దపులి రక్షణకు చర్యలు చేపడుతున్నారు. రెండు రేంజ్‌ల సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ పులి ఆవాసానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశారు.
రైతుల్లో భయాందోళన
పెద్దపులి పంట చేలలో సంచరిస్తుండటంతో రైతులు, కూలీలు హడలిపోతున్నారు. విస్తారమైన వర్షాలతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. పులి సంచారం సమాచారంతో కూలీలు పనులకు రావడం లేదని అన్నదాతలు చెబుతున్నారు. సాధారణంగా మహారాష్ట్రలోని తడోబా రిజర్వు ఫారెస్టు నుంచి పెద్ద పులులు కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోకి ప్రవేశిస్తుంటాయి. పెన్‌గంగ, ప్రాణహిత నదులు దాటి కాగజ్‌నగర్, సిర్పూర్(టి), బెజ్జూర్, పెంచికల్‌పేట్, దహెగాం అడవుల్లో సంచరిస్తాయి. ఈ క్రమంలో తోడు, ఆహారం కోసం కొన్నిసార్లు మైదాన ప్రాంతాల్లోని పంట చేల వైపు వస్తున్నాయి. పశువులు, మనుషులపైనా దాడులకు పాల్పడుతున్నాయి. 2020 నవంబర్ 11న దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన విఘ్నేష్ పులి దాడిలో చనిపోయిన విషయం తెలిసిందే. అదే ఏడాది నవంబర్ 29న పెంచికల్‌పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన పసుల నిర్మల చేనులో పత్తి తీస్తుండగా దాడి చేసి హతమార్చింది. 2023 నవంబర్ 16న వాంకిడి మండలం కమాన్‌పూర్ గ్రామానికి చెందిన భీము పంట చేనులో పులి దాడిలో చనిపోయాడు. 2024 నవంబర్ 29న కాగజ్‌నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన మోర్లె లక్ష్మి సైతం పులిదాడిలో చనిపోయింది.
వేటగాళ్ల ఉచ్చుల ముప్పు
జిల్లాలో 6,04,172 ఎకరాల అటవీ విస్తీర్ణం ఉంది. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్ల పరిధిలో 11 రేంజ్‌లు ఉన్నాయి. కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలో సుమారు మూడు పెద్దపులులు సంచరిస్తున్నట్లు అంచనా.. పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి ఆవాసాన్ని వెతుకుంటూ వస్తున్న పెద్దపులులు డివిజన్ పరిధిలోని అటవీ ప్రాంతాల్లో వేటగాళ్లు ఉచ్చులకు బలవుతున్నాయి. టైగర్ కారిడార్‌గా ఉన్న కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో పులుల సంరక్షణ అటవీశాఖ అధికారులుకు సవాలుగా మారింది. 2024 డిసెంబర్ 27న దరిగాం అటవీ ప్రాంతంలో విషప్రయోగంతో ఎస్ 9, కే 15 అనే రెండు పులులు మృతి చెందిన విషయం తెలిసిందే. పెంచికల్‌పేట్ రేంజ్ పరిధిలోని కోయచిచ్చాల అటవీ ప్రాంతంలో 2025 మే 13న వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి కే8 అనే పులి మృతి చెందడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. నాటి ఘటనలతో జిల్లాలో పులుల సంరక్షణపై నీలినీడలు అలుముకున్నాయి. తాజాగా కొత్త పులి పెంచికల్‌పేట్ రేంజ్‌లోని అగర్‌గూడ, మెరెగూడ, కోయచిచ్చాల, లోడుపల్లి, కొండపల్లి, బెజ్జూర్ రేంజ్ పరిధిలోని పాపన్‌పేట్, తలాయి, మత్తడి ప్రాంతాల్లో సంచరిస్తోంది. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన నిఘా కోసం అధికారులు చర్యలు చేపడుతున్నారు.
కదలికలు గమనిస్తున్నాం
పెంచికల్‌పేట్ రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తోంది. అగర్‌గూడకు చెందిన ద్విచక్ర వాహనదారులకు కనిపించడంతో సమాచారం అందించారు. అటవీ ప్రాంతంలో ప్రత్యేక బృందాలతో పాదముద్రలు, ట్రాప్ కెమెరాలతో పులి కదలికలను గమనిస్తున్నాం. ప్రజలు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లొద్దు. పులి కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమచారం అందించాలి. పులి ఆవాసానికి ఆటంకం ఏర్పడకుండా సహకరించాలి.
– అనిల్‌కుమార్, ఎఫ్‌ఆర్‌వో, పెంచికల్‌పేట్


