పరిశుభ్రతతో వ్యాధులు దూరం | - | Sakshi
Sakshi News home page

పరిశుభ్రతతో వ్యాధులు దూరం

Aug 9 2026 1:46 AM | Updated on Aug 9 2026 1:46 AM

● సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తప్పనిసరి ● ‘సాక్షి’తో డీఎంహెచ్‌వో నాగేంద్ర

ఆసిఫాబాద్‌అర్బన్‌: వానాకాలంలో సీజన్‌లో వ్యాధులు ప్రబలకుండా పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని డీఎంహెచ్‌వో నాగేంద్ర సూచించారు. పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు దరి చేరవని పేర్కొన్నారు. సీజనల్‌ వ్యాధులు వ్యాపించకుండా జిల్లాలో ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. శనివారం ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే..

డ్రై డే నిర్వహణకు ఆదేశాలిచ్చాం

ప్రతీ మంగళ, శుక్రవారాల్లో డ్రై డే నిర్వహించాలని సిబ్బందికి ఆదేశాలిచ్చాం. ఇళ్లు, ఆఫీసులు, పాఠశాలల్లో పాత్రలు, కూలర్లు, పూలకుండీలు, కొబ్బరి చి ప్పలు, పాత టైర్లలో నీరు నిల్వ లేకుండా చూస్తాం. మురుగునీరు నిలిచే చోట ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలతో దోమల నివారణ మందు చల్లిస్తాం.

ఇంటింటా అవగాహన కల్పిస్తున్నాం

గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో దోమల నియంత్రణ చర్యలు చేపడుతున్నాం. తాగునీటి ట్యాంకుల్లో క్లోరి నేషన్‌ చేయిస్తున్నాం. పీహెచ్‌సీల వారీగా ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు, హెల్త్‌ అసిస్టెంట్లు, సూపర్‌వైజ ర్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటా అవగాహన కల్పిస్తున్నాం. జ్వరం, మలేరియా, డెంగీ అనుమానిత కేసులను త్వరగా గుర్తించి ర్యాపిడ్‌ డయోగ్నస్టిక్‌ టెస్టులు, అవసరమైన చోట మెడికల్‌ క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు జిల్లాలో 12 మలేరియా, 2 డెంగీ కేసులు నమోదయ్యాయి. సీహెచ్‌సీల్లో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, జ్వరం మందులు, యాంటీబయాటిక్స్‌, మలేరియా ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు, పాముకాటు కేసులను దృష్టిలో ఉంచుకుని యాంటి స్నేక్‌ వేనం ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచాం.

వైద్యుల కొరత ఉన్నప్పటికీ..

జిల్లాలోని 17 పీహెచ్‌సీలుండగా ప్రస్తుతం రెగ్యులర్‌ వైద్యుల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో కొందరు వైద్యులు ఇతర పీహెచ్‌సీలకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ అందుబాటులో ఉన్న మానవ వనరులతో ప్రజలకు సేవల్లో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం.

ప్రజలు భాగస్వాములు కావాలి

వ్యాధుల నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలి. సీజనల్‌ వ్యాధుల నియంత్రణలో వైద్యారోగ్యశాఖతో పాటు పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖలు, ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకం. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే వ్యాధుల వ్యాప్తిని నియంత్రించవచ్చు.

కటాఫ్‌ గ్రామాలపై ప్రత్యేక దృష్టి

జిల్లాలోని 135 కట్‌ఆఫ్‌ గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాం. సీజనల్‌ వ్యాధులపై అవగా హన కల్పిస్తున్నాం. గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు, ఇతర హైరిస్క్‌ వర్గాల ఆరోగ్య పరి స్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. గర్భిణు ల డెలివరీ తేదీలను గుర్తించి వారిని ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు, సంబంధిత సిబ్బంది ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. అవసరమైతే ముందస్తుగా సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు తరలిస్తాం. రవాణా సౌకర్యం, అ త్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సేవలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.

వైద్యపరీక్షలు చేయించుకోవాలి

ఎవరికై నా జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వాంతులు, నీరసం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప పీహెచ్‌సీకి వెళ్లి రక్త పరీక్షలు చేయించుకోవాలి. వైద్యుల సలహా మేరకు చికిత్స పొందాలి. గతేడాది జిల్లాలో 73 డెంగీ, 37 మలేరియా కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదైన ఏరియాలను హైరిస్క్‌ ప్రాంతాలుగా గుర్తించి వైద్యశిబిరాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement