రైతులపై రవాణా భారం! | - | Sakshi
Sakshi News home page

రైతులపై రవాణా భారం!

Aug 5 2026 1:41 AM | Updated on Aug 5 2026 1:41 AM

ఎరువుల రవాణా చార్జీలు ఉపసంహరించుకున్న మార్క్‌ఫెడ్‌ అన్నదాతల నుంచి వసూలు చేస్తున్న సహకార సంఘాలు ఒక్కో బస్తాపై రూ.32 నుంచి రూ.55 వరకు పెంపు

రెబ్బెన: పెరిగిన ఎరువుల ధరలతో సతమతమవుతున్న అన్నదాతలపై మరోభారం పడింది. ఇప్పటివరకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ఎరువులు లభించేవి. ఇక నుంచి సహకార సంఘాలకు సరఫరా చేసే ఎరువుల రవాణా భారాన్ని రైతులే భరించాలి. రవాణా చార్జీలను రద్దు చేస్తూ జీవో విడుదలైంది. ప్రస్తుతం రవాణా చార్జీలతో కలిసి ఎరువుల బస్తాలు విక్రయిస్తున్నారు. సాధారణంగా సహకార సంఘాలకు మార్క్‌ఫెడ్‌ ద్వారా రైతులకు సరిపడా ఎరువులు సరఫరా చేస్తారు. గోదాముల నుంచి లారీల ద్వారా ఎరువులను పంపిస్తూ లారీ కిరాయి, హమాలీ ఖర్చులను మార్క్‌ఫెడ్‌ భరించేది. సహకార సంఘాలు రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులను విక్రయించేవి. అయితే జూలై 9 నుంచి సహకార సంఘాలకు మార్క్‌ఫెడ్‌ పంపించే ఎరువులకు సంబంధించిన లారీ కిరాయి ఖర్చును ఉపసంహరించుకుంది. ప్రస్తుతం ప్రైవేటు ఫర్టిలైజర్‌ షాపుల మాదిరిగానే సహకార సంఘాల్లోనూ ప్రభుత్వ ధర కంటే ఎక్కువ ధరకు ఎరువుల బస్తాలను విక్రయిస్తున్నారు. లారీల కిరాయి, హమాలీ ఖర్చులను రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. ఒక్కో బస్తాపై రూ.32 నుంచి రూ.55 వరకు అధికంగా చెల్లించాల్సి వస్తోంది. ప్రైవేటు ఫర్టిలైజర్‌ షాపుల్లో డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల బస్తాపై ఏకంగా రూ.200 నుంచి రూ.300 వరకు అధికంగా వసూలు చేస్తున్నారు.

దూరాన్ని బట్టి ఖర్చు

జిల్లాలో ప్రస్తుతం 12 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 15 మండలాలకు చెందిన రైతులకు ఎరువులను విక్రయిస్తున్నారు. జిల్లాలోని సహకార సంఘాలకు మంచిర్యాల, ఆదిలాబాద్‌ ప్రాంతాల్లోని గోడౌన్‌ల నుంచి అవసరాన్ని బట్టి ఎ రువుల బస్తాలు అందిస్తున్నారు. ఆదిలాబాద్‌ దూ రం కావడంతో ఈ సీజన్‌లో అధికంగా మంచిర్యాల నుంచే సరఫరా చేస్తున్నారు. గతంలో మంచిర్యాల, ఆదిలాబాద్‌ ప్రాంతాల నుంచి సరఫరా చేసే ఎరువు ల బస్తాలకు రవాణా చార్జీలను మార్క్‌ఫెడ్‌ భరించగా.. ప్రస్తుతం ఎల్‌వోఎల్‌ను ఉపసంహరించుకున్నారు. మంచిర్యాల నుంచి రెబ్బెనకు ఒక లారీ ఎరువులను(444 బస్తాలు) తీసుకువస్తే కిరాయి రూ.12,978 అవుతుంది. హమాలీ మామూలు కింద మరో రూ.1000 అదనంగా చెల్లిస్తున్నారు. అదే ఆదిలాబాద్‌ నుంచి తీసుకువస్తే లారీ కిరాయి కింద రూ.23,360, హమాలీ మామూలు కింద మరో రూ.1000తో కలిపి మొత్తం రూ.24,360 ఖర్చు అవుతోంది. ఈ మొత్తాన్ని రైతుల నుంచే రాబడుతున్నారు. మంచిర్యాల నుంచి ఎరువులను తీసుకువస్తే ఒక్కో బస్తాపై రైతుపై రూ. 31.48, అదే ఆదిలాబాద్‌ నుంచి సరఫరా అయితే రూ.54.86 అధికంగా భారం పడుతోంది. కౌటాల, బెజ్జూర్‌ ప్రాంతాల రైతులపై ఈ భారం దాదాపు రూ.50 నుంచి రూ.70 వరకు ఉంటుంది.

రవాణా చార్జీలు ఇవ్వడం లేదు

ఇంతకు ముందు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు సరఫరా చేసే ఎరువుల రవాణా చార్జీలను మార్క్‌ఫెడ్‌ భరించింది. ఈ నెల 9 నుంచి ఆ చార్జీలను ఉపసంహరించుకుంటున్నట్లు జీవో విడుదల చేసింది. ప్రస్తుతం రవాణా చార్జీల భారాన్ని కలిపి రైతుల నుంచి తీసుకుంటున్నాం. తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో మార్క్‌ఫెడ్‌ ఈ విషయంపై పునరాలోచిస్తోంది.

– కరుణాకర్‌, జిల్లా సహకార శాఖ అధికారి

రైతుల నుంచి వ్యతిరేకత

సహకార సంఘాల ద్వారా విక్రయించే ఎరువులపై రవాణా భారాన్ని మోపుతుండటంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్‌లో సహకార సంఘాల్లో కేవలం యూరియా మాత్ర మే అందుబాటులో ఉండగా, రూ.266లకే లభ్యమయ్యేది. అదే ప్రైవేటు ఫర్టిలైజర్‌ షాపుల్లో ఒక్కో యూరియా బస్తాను రూ.330 నుంచి రూ.350 వరకు విక్రయిస్తున్నారు. సహకార సంఘంలో కొనుగోలు చేస్తే దాదాపు రూ.60 నుంచి రూ.80 వరకు ఆదా అవుతోంది. ఈ సమయంలో మార్క్‌ఫెడ్‌ రవాణా భారాన్ని రైతులపై మోపడంతో రూ.32 వరకు భారం పడుతోంది. ఈ సీజన్‌ ప్రారంభంలో కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు అమాంతం పెరిగిన విషయం తెలిసిందే. తాజాగా సహకార సంఘాల రవాణా భారాన్ని సైతం రైతులపై మోపడంతో మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement