తల్లిపాలే అమృతం! | - | Sakshi
Sakshi News home page

తల్లిపాలే అమృతం!

Aug 5 2026 1:41 AM | Updated on Aug 5 2026 1:41 AM

శిశువు ఆరోగ్యానికి తొలి పునాది.. ఆరు నెలల వరకు శ్రీరామరక్ష జిల్లాలో ఈ నెల 7 వరకు తల్లిపాల వారోత్సవాలు జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు

ఆసిఫాబాద్‌అర్బన్‌: శిశువుల ఆరోగ్యానికి తల్లిపాలే తొలి పెట్టుబడి.. వారిలో రోగ నిరోధక శక్తిని పెంచి, భవిష్యత్తులో వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని సంసిద్ధం చేస్తాయి. కొందరు తల్లులు మాత్రం అవగాహన లేపోవడం, అనారోగ్య సమస్యలు, ఇతర కారణాలతో పోతపాలు పట్టిస్తున్నారు. ఫలితంగా చిన్నారుల్లో రోగనిరోధక శక్తి తగ్గి తరచూ జబ్బుల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో తల్లిపాల విశిష్టతను వివరిస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 1 నుంచి తల్లిపాల వారోత్సవాలు ప్రారంభించగా, ఈ నెల 7 వరకు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా ముర్రుపాలు పట్టడం, తల్లిపాల ప్రాముఖ్యతపై సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

బాలింతలకూ పోషకాహారం అవసరం

జిల్లా వ్యాప్తంగా ఐదు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 1,006 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. 39,153 మంది చిన్నారులు, 4,507 మంది గర్భిణులు, 1,853 మంది బాలింతలు ఉన్నారు. బిడ్డ పుట్టిన వెంటనే 70 శాతం మంది తల్లులు ముర్రుపాలు పట్టిస్తుండగా, ఆరు నెలల వరకు పాలు మాత్రమే పట్టించేవారు కేవలం 30 శాతం మందే ఉంటున్నారని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ప్రసవం తర్వాత బాలింతలు తీసుకునే ఆహారం కూడా పోషక విలువలతో కూడి ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. తల్లి పోషకాహారం తీసుకుంటేనే బిడ్డకు కూడా పాలు సమృద్ధిగా అందుతాయి. బాలింతలు రోజుకు 600 గ్రాముల అన్నం, 200 గ్రాముల పప్పు, తప్పనిసరిగా పాలు తీసుకోవాలి. ఆహారంలో పప్పుధాన్యాలు, ఆకుకూరలు, పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.

ముర్రుపాలతో రోగాలు దూరం

బిడ్డ పుట్టిన మొదటి రెండురోజులు ఎంతో కీలకం. తప్పనిసరిగా ముర్రుపాలు తాగించాలి. ఇందులో కొలోస్ట్రమ్‌ పుష్కలంగా ఉండి బిడ్డలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పలు రకాల వ్యాధులకు దూరంగా ఉంచుతుంది. ఆరు నెలల పాటు తల్లిపాలు ఇస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. శారీరక, మానసిక వికాసానికి కావాల్సిన ప్రొటీన్లు, విటమిన్లు, పిండి పదార్థాలన్నీ సమతుల్యంగా లభిస్తాయి. అందుకే కనీసం ఆరు నెలల వరకు తప్పనిసరిగా తల్లిపాలనే అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం పిలుపునిస్తోంది. పోతపాలు తాగే పిల్లలతో పోలిస్తే తల్లిపాలు తాగిన పిల్లల్లో ఊబకాయం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, డయాబెటిస్‌ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువ. కొన్ని రకాల క్యాన్సర్లు, మానసిక రుగ్మతల నుంచి రక్షణ లభిస్తుంది. పాలు ఇవ్వడం బిడ్డకే కాదు.. తల్లి ఆరోగ్యానికీ ఎంతో మంచిది. కాన్పు తర్వాత వచ్చే మానసిక ఒత్తిళ్లు సైతం తగ్గుతాయి. పాలిచ్చే సీ్త్రలలో రొమ్ము క్యాన్సర్‌, అండాశయ క్యాన్సర్‌ ముప్పు చాలా వరకు తగ్గుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement