సర్కారు ఆసుపత్రుల్లో అందని ఉచిత సేవ అవకాశం ఉన్నా సాంకేతికత లోపాలతో అవస్థలు సమస్య పరిష్కరిస్తే పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా పొందే ‘బాల ఆధార్’ సేవలు బాలారిష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు చిన్నారుల వరకు ఎలాంటి బయోమెట్రిక్ నమోదు లేకుండానే బాల/శిశు ఆధా ర్ జారీ చేయాలనే ఉద్దేశంతో యూఐడీఏఐ(యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రత్యేకంగా ఈ వీలు కల్పించింది. మొదట పిల్లలకు పేర్లు పెట్టకముందే బేబీ ఆఫ్‌తోనే తల్లిదండ్రుల ఆధార్‌తో కార్డులు జారీ చేశారు. కానీ కొన్ని చోట్ల ఈ సేవను దుర్వినియోగం చేస్తున్నారని గుర్తించారు. దీంతో మీ సేవ కేంద్రాల్లో జనన ధ్రువీకరణ పత్రం ఉంటేనే బాల ఆధార్ నమోదు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ప్రభుత్వాసుపత్రుల్లో ఈ సేవలు అందడం లేదు. మంచిర్యాల, ఆసిఫా బాద్, కాగజ్‌నగర్, ఆదిలాబాద్, నిర్మల్ ప్రభుత్వాసుపత్రుల్లో అరకొరగా సేవలు అందుతున్నాయి. గత కొన్ని నెలలుగా ఈ సేవలు కూడా అందడం లేదు. దీంతో తల్లిదండ్రులు చిన్నారులకు ఆధార్ కోసం తిప్పలు పడుతున్నారు. ఆధార్ చిన్నారుల నివాస రుజువు, తల్లిదండ్రుల ఆధార్‌తో అనుసంధానం, టీకాలు, ‘అభా’ కార్డు, రేషన్‌కార్డుతోపాటు ఇతర అనేక చోట్ల తప్పనిసరిగా మారింది.
ప్రతీరోజు సాంకేతిక సమస్యలే..
రాష్ట్ర వ్యాప్తంగా ప్రసవాలు అధికంగా జరిగే పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, మాతాశిశు సంరక్షణ కేంద్రాల్లో కేసీఆర్ కిట్ నిర్వహణ చూసే సిబ్బందికే బాల ఆధా ర్ జారీ బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర వ్యాప్తంగా 140మంది వరకు సిబ్బందికి ప్రత్యేకంగా ట్యాబ్‌లు అందజేశారు. ఈ యాప్‌లో శిశు ఫొటో, తల్లిదండ్రు ల వివరాలు నమోదు చేసి, కార్డు జారీ చేయవచ్చు. ఈ సేవలు అవకాశం ఉన్నా ఏ ప్రభుత్వ ఆసుపత్రి లోనైనా ఉచితంగా పొందవచ్చు. చాలా చోట్ల ఈ కార్డు జారీపై అవగాహన లేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా పొందే సేవలకు దూరం అవుతున్నా రు. ఇక ఎవరైన ఆధార్ కోసం వెళ్లినా యాప్ సరిగా పని చేయకపోవడంతో రోజుల తరబడి సేవలు ని లుస్తున్నాయి. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా సిబ్బంది రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వాట్సాప్ వేదికగా సాంకేతిక సమస్యలు తీర్చాలని ఎప్పటికప్పుడు గ్రూప్‌లో పోస్టు చేస్తున్నా పట్టించుకునే వారే లేరు. ఓటీపీలు రాక, సర్వర్ ఎర్రర్, వివరాలు అప్ లోడ్ కాక అవస్థలు పడుతున్నారు. సాంకేతిక సమస్యలను హైదరాబాద్ కేంద్రంగా ఈ యాప్‌లో ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సి ఉన్నా పట్టింపు కరువైంది. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వాసుపత్రుల్లో తల్లి, బిడ్డ ఒకే చోట ఉన్న సమయంలోనే ఉచితంగా సులువుగా పొందే ఆధార్ కార్డు ప్రైవేటు ఆధార్ కేంద్రాల వద్దకు వెళ్లాల్సి వస్తోంది.


