‘మున్సిపల్’కు అడుగులు!
ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్ విడుదల జవవరి 10న తుది ఓటరు జాబితా త్వరలోనే ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల్లో ఎన్నికలు
ఆసిఫాబాద్‌అర్బన్/కాగజ్‌నగర్‌టౌన్: త్వరలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుంది. జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. గతేడాది జనవరిలోనే పురపాలిక సంఘాల పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ఇటీవల పంచా యతీ ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో అందరి దృష్టి మున్సిపల్ ఎన్నికలపై పడింది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం తుది ఓటరు జాబితా రూపకల్ప న సవరణ కోసం షెడ్యూల్ ప్రకటించింది. మున్సి పాలిటీల వారీగా పోలింగ్ కేంద్రాల పునర్ వ్యవస్థీకరణ, కొత్తవాటి గుర్తింపు ప్రక్రియను ప్రారంభించారు. అలాగే మంగళవారం పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు జాబితా ప్రకటించనున్నారు. జనవ రి 1న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించి ఓట ర్ల పేర్లు, చిరునామాలపై అభ్యంతరాలు స్వీకరిస్తా రు. 5న మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో రాజకీ య పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు. 6న జిల్లా ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో జిల్లాస్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి ఓటరు జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. మార్పులు, చేర్పులతో జనవరి 10న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నారు.
రెండు మున్సిపాలిటీలు
జిల్లాలో కాగజ్‌నగర్ మున్సిపాలిటీతో పాటు నూతనంగా ఏర్పడిన ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించనున్నారు. 2020 జనవరిలో ఎన్నికై న పాలకవర్గాల గడువు జనవరిలోనే ముగిసింది. 11 నెలలుగా మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా, 19,213 జనాభా ఉంది. అలాగే పారిశ్రామిక ప్రాంతమైన కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా, 59,734 జనాభా ఉంది. గత రికార్డుల ప్రకారం ఇక్కడ 44,946 మంది ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 22,337 మంది, మహిళలు 22,609 మంది ఉన్నారు. ఓటర్ల వివరాలను వార్డుల వారీగా విభజించేందుకు బీఎల్‌వోలు సర్వే చేపట్టనున్నారు.
రిజర్వేషన్లు మారుతాయా..?
కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు, ఆర్థిక సంఘం నిధుల విడుదలకు పాలకవర్గాలు తప్పనిసరి కావడంతో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ దిశగా అడుగులు వేస్తోంది. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం కావడం, కాగజ్‌నగర్ పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇక్కడ అభివృద్ధి పనులకు నిధుల అవసరం అధికంగా ఉంది. ఎన్నికలు పూర్తయితే కేంద్ర నిధులు మంజూరయ్యే వెసులుబాటు కలుగుతుంది. జిల్లా, మండల పరిషత్తులకు రిజర్వేషన్లు మారుతాయనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో మున్సిపాలిటీలకు పాత రిజర్వేషన్లు కొనసాగిస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిజర్వేషన్లలో మార్పు లేకుంటే వేగంగా ఎన్నికల ప్రక్రియ వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. పోటీలో నిలిచేందుకు ఆశావహులు మాత్రం సన్నద్ధత ప్రారంభించారు.


