‘మధ్యాహ్న’ కార్మికుల నిరసన
ఆసిఫాబాద్‌రూరల్: సమస్యలు పరిష్కరించాలని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మంగళవారం మధ్యాహ్న భోజన కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు త్రివేణి, ప్రధాన కార్యదర్శి రాజేందర్ మాట్లాడుతూ కౌటాల మండలంలోని ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులను తొలగిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడం సరికాదన్నారు. ఉపాధ్యాయులు కక్షసాధింపుతో వంట సక్రమంగా చేయలేదని ఆరోపణలు చేశారని తెలిపారు. మరోసారి విచారణ చేపట్టి వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న కోడిగుడ్లు, మెస్ బిల్లులు, వేతనాలు చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు కృష్ణమాచారి, నాయకులు రూప, చంద్రకళ, అనసూయ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


