గతంలో పూర్తయిన
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు
అసంపూర్తి ఇళ్ల నిర్మాణం పూర్తికి
బిల్లులు కూడా..
ఇంకొన్ని చోట్ల స్లాబ్‌లకు
రూ.2 లక్షల చొప్పున నిధులు
ఈ కోటాలో నియోజకవర్గానికి
500 మంది లబ్ధిదారుల ఎంపిక
సర్వే ప్రారంభించాం...
హంగులు అద్ది
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా మిగిలిపోయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పూర్తిచేసి అర్హులకు కేటాయించడమే కాక ప్రస్తుతం మంజూరైనా నిధుల సమస్యతో మధ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిలిపివేసిన లబ్ధిదారులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఇదే సమయాన గత ప్రభుత్వ హయాంలో నిర్మాణ పూర్తయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కూడా కేటాయించనున్నారు. అంతేకాక వ్యక్తిగతంగా కొంత వరకు ఇళ్లు నిర్మించుకుని స్లాబ్ వేయని వారికి రూ.2 లక్షల చొప్పున నిధులు అందించనున్నారు. ఓవైపు రెండో దశ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూనే, అసంపూర్తి నిర్మాణంపై దృష్టి సారించనుండడంతో ఎక్కువ మందికి లబ్ధి జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
‘డబుల్’ ప్రయోజనం..
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని వీలైనంత ఎక్కువ మందికి ఇళ్లు కేటాయించాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు నూతన నిర్ణయాలను తీసుకుంటోంది. ఇందులో భాగంగా గతంలో నిర్మాణం పూర్తయిన, అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కూడా కేటాయించేందుకు సిద్ధమైంది. అంతేకాక అపార్ట్‌మెంట్ల మాదిరి నిర్మించి మధ్యలో ఆగిన పనులను కూడా కాంట్రాక్టర్ల ద్వారా పూర్తి చేయించి లబ్ధిదారులకు కేటాయించేలా ప్రణాళిక రూపొందించారు. ఈక్రమంలోనే ఇటీవల కలెక్టర్ దివాకర టీ.ఎస్. నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం, సింగిరెడ్డిపాలెం, శంకరగిరి తండా, కూసుమంచి మండలం మల్లేపల్లి, ఖమ్మంఅర్బన్ మండలం ధంసలాపురంల్లో అసంపూర్తి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పరిశీలించారు.
కేటాయింపునకు సిద్ధం
గత ప్రభుత్వ హయాంలో ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం, మధిర, తల్లాడ మండలాల పరిధిలో 777 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అందులో 72 ఇళ్లను ఎవరికీ కేటాయించకోవడంతో ప్రస్తుతం లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖమ్మం అర్బన్ మండలంలోని శివాయిగూడెంలో 33 ఇళ్లు, మధిర మండలం దెందుకూరులో 20, ఇల్లూరులో 10, రఘునాథపాలెం మండలం చిమ్మపుడిలో ఏడింటితో పాటు తల్లాడ మండలం మిట్టపల్లిలో రెండు ఇళ్లు ఈ కోటాలో ఉన్నాయి.
అసంపూర్తి ఇళ్లపై దృష్టి
జిల్లాలోని కొన్ని మండలాల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం నిలిచిపోయింది. వివిధ దశల్లో 437 ఇళ్లు అసంపూర్తిగా ఉండడంతో అదే స్థితిలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల కోటాలో కేటాయిస్తారు. నిర్మాణం దశ వరకు మినహాయించి మిగిలిన పనులకు అవసరమైన నిధులు కేటాయిస్తారు. ఇవికాక ధంసలాపురంలో 192, ఖమ్మం అర్బన్ మండలం కై కొండాయిగూడెంలో 32, నేలకొండపల్లి మండలం సింగారెడ్డిపాలెంలోని 48 ఇళ్లు జీ ప్లస్ 2 అపార్ట్‌మెంట్ల మాదిరి ఉన్నాయి. ఈ ఇళ్లను కాంట్రాక్టర్‌తో పూర్తి చేయించాలని భావిస్తుండగా, ఆ తర్వాత లబ్ధిదారులకు కేటాయిస్తారు.
గతంలోనే పూర్తయిన 72 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించలేదు. ఆ ఇళ్లలో మిగిలిన పనులు పూర్తి చేయించి లబ్ధిదారులకు కేటాయిస్తాం. ఇక అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లు, జీ ప్లస్ 2 ఇళ్లను కూడా పూర్తి చేయిస్తున్నాం. గతంలో ఇంటి నిర్మాణం స్లాబ్ దశలో ఆపేసిన వారికి ప్రభుత్వం రూ. 2లక్షలు కేటాయించనుంది. ఈ కోటాల్లో లబ్ధిదారుల ఎంపికకు సర్వే
చేస్తున్నాం. – భూక్యా శ్రీనివాస్, హౌసింగ్ పీడీ


