● కేఎంసీ పారిశుద్ధ్య కార్మికుల మెరుపు సమ్మె ● కొలిక్కిరాని అధికారుల చర్చలు ● నేటి ఉదయం స్పష్టత ఇస్తేనే సమ్మె విరమణ
ఖమ్మం మయూరిసెంటర్: నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దుతూ ప్రజల ఆరోగ్యాలను సంరక్షిస్తున్న తమపై కాంట్రాక్టర్లు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ విభాగాల పారిశుద్ధ్య కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. కొద్దినెలలుగా కాంట్రాక్టర్లు వేతనాలు ఇవ్వకపోగా, ఇదేమిటని అడిగితే ఓ కాంట్రాక్టర్ పనికి రాకుండా అడ్డుకుంటున్నాడని ఆరోపించారు. ఔట్ సోర్సింగ్ కార్మికులకు సైతం వేతనాలు సక్రమంగా రావడం లేదని పేర్కొన్నారు. ఈమేరకు సీఐటీయూ, టీయూసీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యాన కార్మికులు శుక్రవారం ఉదయం కేఎంసీ ఎదుట ధర్నా చేపట్టారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పనులకు వెళ్లేది లేదంటూ తేల్చిచెప్పడంతో నగరంలో పారిశుద్ధ్య పనులు స్తంభించాయి.
కాంట్రాక్టర్ల తీరుపై నిరసన
కేఎంసీలో పారిశుద్ధ్య పనుల కోసం కార్మికులు కొందరిని ఔట్ సోర్సింగ్ విధానంలో, ఇంకొందరిని కాంట్రాక్టర్ల ద్వారా నియమించారు. నగరంలోని 60 డివిజన్లను నాలుగు జోన్లను విభజించి ముగ్గురు కాంట్రాక్టర్లకు కేటాయించారు. ఇందులో ఇద్దరు కాంట్రాక్టర్లు వేతనాలు సక్రమంగా ఇవ్వడం లేదని కార్మికులు కొద్దినెలలుగా ఆరోపిస్తున్నారు. ఓ కాంట్రాక్టర్ నిర్ణయించిన దాని కంటే తక్కువ వేతనం చెల్లిస్తూ, రెండు నెలల బకాయి వేతనం ఇవ్వాలని కోరితే పనికి రానివ్వడం లేదని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
సమ్మె కొనసాగిస్తాం..
కార్మికులకు కోతలు లేకుండా సకాలంలో వేతనాలు చెల్లించడమే కాక రక్షణ పరికరాలు ఇవ్వాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అంతేకాక మృతి చెందిన కార్మికులకు హామీ ప్రకారం నగదు చెల్లించాలని, గతంలో చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను తీసుకోవాలన్నారు. సమస్య వచ్చిన ప్రతీసారి అధికారులు హామీ ఇచ్చి, ఆ తర్వాత విస్మరిస్తున్నందున ఈసారి సమస్యలు పరిష్కారం అయ్యేవరకూ సమ్మె కొనసాగిస్తామని సంఘాల జిల్లా ప్రధాన కార్యదర్శులు జి.రామయ్య, టి.విష్ణు, రామాంజనేయులు తదితరులు వెల్లడించారు.
నేడు మరో దఫా చర్చలు
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్మికుల సమ్మె నేపథ్యాన డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ కార్మిక సంఘాల నాయకులతో చర్చించారు. డ్రైవర్ల హాజరు, కార్మికులకు రక్షణ పరికరాలు, ఆదివారం, పండుగ రోజుల్లో సెలవులు, వేతనాలు, వారసత్వ ఉద్యోగాలపై చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక వేతనాల అంశంపై శనివారం ఉదయం చర్చిస్తామని చెప్పగా, ఆ చర్చల్లో స్పష్టత వచ్చాకే సమ్మె విరమిస్తామని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు.


