● పోలీసు కమిషనర్ సునీల్‌దత్
ఖమ్మం మయూరిసెంటర్(ఖమ్మం క్రైం): నిందితులు చట్టం నుంచి తప్పించుకోకుండా ప్రతీ కేసులో సమర్థవంతమైన దర్యాప్తు చేయడమే కాక పక్కా సాక్ష్యాధారాలు సేకరించేలా అధికా రులకు సూచించినట్లు పోలీసు కమిషనర్ సునీల్‌దత్ వెల్లడించారు. ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపడంతో ఈ ఏడాది ఇప్పటివరకు 103 కేసుల్లో 172 మందికి జైలుశిక్ష, రూ.13,67,150 జరిమానా విధిస్తూ తీర్పులు వెలువడ్డాయని తెలిపారు. కేసుల విచారణలో లోపాలు తలెత్తకుండా వేగంగా జరిగేలా కోర్టు మానిటరింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడించారు. నేరస్తులకు శిక్ష పడేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్టు డ్యూటీ ఆఫీసర్, దర్యాప్తు అధికారి, సాక్షుల మధ్య సమన్వయం పెరిగేలా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
నూతన ఎకై ్సజ్ ఎస్‌ఐలకు పోస్టింగ్
ఖమ్మంక్రైం: గ్రూప్–2 ద్వారా ఎంపికై ఎకై ్సజ్ ఎస్సైలుగా ఇటీవల శిక్షణ పూర్తిచేసుకున్న 11మందిని ఉమ్మడి జిల్లాకు కేటాయించారు. వీరికి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని వివిధ స్టేషన్లలో పోస్టింగ్ ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈమేరకు కారేపల్లి ఎస్‌ఐగా పృధ్వీరాజు, మధిర ఎస్‌ఐగా టి.సందీప్, సత్తుపల్లికి కె.సురేష్, ఇల్లెందుకు జె.వేణు, డి.నాగఅమృత, పాల్వంచ ఎస్‌ఐలుగా ఉపేందర్, సీహెచ్.నవీన్, భద్రాచలం ఎస్‌ఐగా బి.రమేష్‌నాయక్, అశ్వరావుపేటకు ఎన్.ధనలక్ష్మి, కె.విజయ్‌తో పాటు మణుగూరు ఎస్‌ఐగా లక్ష్మణ్‌కు పోస్టింగ్ ఇచ్చారు.
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
ఖమ్మం వైద్యవిభాగం: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలనే పోత్సహించాలని డీఎంహెచ్‌ఓ రామారావు సూచించారు. ఖమ్మంలో శుక్రవారం వైద్యులు, ఉద్యోగులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిజేరియన్లు తగ్గించి, సాధారణ ప్రసవాలను గరిష్ట స్థాయిలో ప్రోత్సహించాలని తెలిపారు. ఇందుకోసం గర్భిణులు ప్రారంభ దశ నుండే పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పక వైద్యపరీక్షలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే, వ్యాక్సిన్ల ఆవశ్యకతను వివరించాలని తెలిపారు. కాగా, హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోకుండా మిగిలినపోయిన బాలికలను గుర్తించి, టీకా వేయించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అధికారులు వేణుగోపాల్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, అరుణ, దుర్గామల్లేశ్వరి, దుర్గ, రమణ, వీరయ్య, గీత పాల్గొన్నారు.
రేపటి నుంచి పీజీ తరగతులు
ఖమ్మం సహకారనగర్: ఖమ్మం ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రంలో పీజీ అభ్యర్థులకు ఆదివారం నుంచి తరగతులు మొదలుకానున్నాయి. ఎంఏ, ఎంకాం, ఎమ్మె స్సీ ప్రథమ సంవత్సరం మొదటి సెమిస్టర్ అభ్యర్థులు తరగతులకు హాజరుకావాలని కావాలని ప్రిన్సిపాల్ డాక్టర్ జాకీరుల్లా, కోఆర్డినేటర్ డాక్టర్ వీరన్న సూచించారు.
జమలాపురంలో
సామూహిక వ్రతాలు
ఎర్రుపాలెం: జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాసం ఏకాదశి సందర్భంగా శుక్రవారం సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించారు. భక్తులతో ప్రధాన అర్చకుడు ఉప్పల శ్రీనివాసశర్మ వ్రతం చేయించారు. సాయంత్రం కోనేరు వద్ద కార్తీక దీపోత్సవం, గంగా హారతి నిర్వహించారు. ఈఓ కె.జగన్‌మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ఉప ప్రధాన అర్చకులు ఉప్పల మురళీమోహన్‌శర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.
సత్తుపల్లి మున్సిపాలిటీకి
‘పీఎం స్వనిధి’ అవార్డు
ఖమ్మంమయూరిసెంటర్: సత్తుపల్లి మున్సిపాలిటీకి జాతీయస్థాయి గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం అందించే ‘పీఎం స్వనిధి సన్మాన్’ అవార్డుకు ఎంపిక కాగా, మున్సిపల్ టీఎంసీ గుడిపూడి సుజాతరాణి శుక్రవారం న్యూఢిల్లీలో స్వీకరించారు. 2019 నుంచి వీధి వ్యాపార సంఘాలను పటిష్టంగా నిర్మించి, వీధి వ్యాపారుల్లో 1,700 మందికి రుణాలను క్రమం తప్పకుండా అందించారు. తెలంగాణ నుంచి వివిధ కేటగిరీల్లో తొమ్మిది మున్సిపాలిటీలను ఎంపిక చేయగా, సత్తుపల్లికి స్థానం దక్కింది.


