నేలకొండపల్లి: దక్షిణ భారతదేశంలో కెల్లా అతి పెద్దదైన నేలకొండపల్లిలోని బౌద్ధక్షేత్రం పరిసరాల్లో పురాతన కట్టడాలు, చారిత్రక ఆనవాళ్లను గుర్తించేందుకు అత్యాధునిక యంత్రాలతో శనివారం నుంచి సర్వే చేపట్టనున్నారు. ఈమేరకు సర్వేకు సంబంధించిన మార్కింగ్, ఏర్పాట్లను పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగరాజు శుక్రవారం పరిశీలించారు. బౌద్ధక్షేత్రంతో పాటు బైరాగి గుట్ట తదితర ప్రాంతాల్లో అత్యాధునిక యంత్రాలతో పది మీటర్ల లోతు వరకు నేషనల్ జియోగ్రఫీ రీసెర్స్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్(ఎన్‌జీఆర్‌ఐ) బృందం సర్వే చేయనుందని తెలిపారు. బౌద్ధక్షేత్రం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్న క్రమాన కట్టడాలు, చారిత్రక ఆనవాళ్లు, బౌద్ధులు నివాసం, వారు వినియోగించిన వస్తువులు తదితర అంశాలను గుర్తించేందుకు ఈ సర్వే చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎన్‌జీఆర్‌ఐ బృందం మూడు రోజుల పాటు అత్యాధునిక యంత్రాలతో భూమిని స్కానింగ్ చేస్తుందని, ఆ తర్వాత నివేదిక ఆధారంగా పురావస్తు శాఖ తవ్వకాలు చేపడుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారి సుమన్‌చక్రవర్తి, పురావస్తు శాఖ ఏడీ గంగాదేవి, జేఈ శంకర్, ఎన్విరాన్‌మెంట్ గ్రీన్‌వే సంస్థ చైర్మన్ దుడ్డెల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
బౌద్ధక్షేత్రం వద్ద నేటి నుంచి ఎన్‌జీఆర్‌ఐ సర్వే


