పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Nov 16 2026 12:08 AM | Updated on Nov 16 2026 12:08 AM

రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కొత్త లబ్ధిదారులకు ‘చేయూత’

మంజూరు పత్రాల పంపిణీ

ఖమ్మంరూరల్‌: పేదల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం పాలన సాగిస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో కొత్తగా చేయూత పింఛన్లు మంజూరైన వారికి ఆయన ప్రొసీడింగ్స్‌ పత్రాలను కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌.తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లబ్ధిదారులు ఇన్నాళ్లు పడిన ఆవేదన, ఇప్పుడు పింఛన్‌ మంజూరుతో వారిలో వెల్లివిరుస్తున్న ఆనందాన్ని అందరూ కళ్లారా చూస్తున్నారని తెలిపారు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోనప్పుడు ప్రభుత్వం ఎన్ని గొప్పలు చెప్పుకున్నా ఉపయోగం ఉండదని, గత ప్రభుత్వం అలాగే వ్యవహరించిందని విమర్శించారు. గత 10–13 ఏళ్లుగా దివ్యాంగులు, వితంతువులు, ఇతర వర్గాల వారికి పింఛన్లు మంజూరు చేయకపోవడంతో ఇబ్బంది పడ్డారని తెలిపారు. కానీ తాము పేదల కష్టాన్ని గుర్తించి ఒకేసారి రాష్ట్రంలో 4.50 లక్షల మందికి చేయూత పింఛన్లు మంజూరు చేశామని చెప్పారు. అంతేకాక మొదటి విడతలో 4.50 లక్షలు, రెండో విడతలో 2.50 లక్షలు, హైదరాబాద్‌లో లక్ష కలిపి రూ.40వేల కోట్ల వ్యయంతో ఎనిమిది లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని వెల్లడించారు. దళిత, గిరిజన, బలహీన వర్గాలు, మైనార్టీల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి తెలిపారు. కలెక్టర్‌ దివాకర మాట్లాడుతూ ఏదులాపురం మున్సిపాలిటీలో ఇప్పటికే 4,700 మంది లబ్ధిదారులు ఉండగా, కొత్తగా 968 మందికి పింఛన్లు మంజూరయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో హౌజింగ్‌ పీడీ భూక్యా శ్రీనివాస్‌, ఆర్‌డీఓ ఎన్‌.శ్రీనివాస్‌, ఏదులాపురం మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌, వైస్‌చైర్మన్‌ పోకబత్తిని అనిత, తమ్మినేని నవీన్‌, కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భారీ బైక్‌ ర్యాలీ

చేయూత లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి ఆదివారం పింఛన్‌ మంజూరు పత్రాలు పంపిణీ చేయగా, కాంగ్రెస్‌ శ్రేణులు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. తిరుమలాయపాలెం మండలం నుంచి వస్తున్న మంత్రికి గొల్లగూడెం వద్ద స్వాగతం పలికిన నాయకులు అక్కడి నుంచి టీసీవీ రెడ్డి ఫంక్షన్‌ హాల్‌ వరకు వందలాది మంది బైక్‌లతో ర్యాలీగా ముందుకు సాగారు. మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్‌ టి.దయాకర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకబత్తిని అనిత, వైస్‌ చైర్మన్‌ తమ్మినేని నవీన్‌, మార్కెట్‌ చైర్మన్‌ బైరు హరినాధబాబు, నాయకులు కిషోర్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement